సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఏకైక నాయకురాలు ఇందిరాగాంధీ అని, ఆమె ప్రపంచం గుర్తించిన గొప్ప నాయకురాలని, ఆమె కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలు చరిత్రలో చెరగని ముద్ర వేశాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఇందిరా గాంధీ 108వ జయంతి పురస్కరించుకొని సంగారెడ్డి ఐబీ ముందు ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సంగారెడ్డి, మెదక్ ప్రజలకు ఇందిరా గాంధీతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఆయన వివరించారు. మెదక్ పార్లమెంట్ నుండి ఎంపీగా గెలిచి ప్రధాని పదవికి చేరిన నేతగా ఆమె చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. అప్పటి మెదక్ కాంగ్రెస్ అగ్రనేతలు రాంచంద్రారెడ్డి, బాగారెడ్డి అభ్యర్థన మేరకు పోటీ చేసి గెలిచి, ఈ ప్రాంత అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి, ఉద్యోగాలివ్వాలన్న సంకల్పంతో సంగారెడ్డికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీడీఎల్, ఇక్రిసాట్‌లను తీసుకువచ్చిన ఘనత ఇందిరా గాంధీదేనని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ప్రధానిగా ఆమె తీసిన సంస్కరణలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందాయని, గరిబీ హటావో నినాదంతో పేదరికాన్ని తగ్గించిన మహత్తర నాయకురాలని కొనియాడారు. భూమిలేని రైతులకు, పేదలకు భూములు పంచడం, గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం వంటి కీలక నిర్ణయాలు సామాజిక న్యాయానికి నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ నేతలు దేశం కోసం రక్తం, ప్రాణం ఇస్తామని అంటారు.. కానీ ఇప్పటి వరకు ఏ బీజేపీ నాయకుడు దేశం కోసం రక్తం ఇవ్వలేదని, ప్రాణం అర్పించలేదని అన్నారు. అయితే ఇందిరా గాంధీ చెప్పినట్లుగానే దేశం కోసం రక్తం, ప్రాణాలు అర్పించిన ఏకైక నాయకురాలు అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, నియోజకవర్గ ఇంచార్జి ఆంజనేయులు, సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ వై.ప్రభు, సంగారెడ్డి బ్లాక్ అధ్యక్షుడు రఘురాంగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు బుచ్చి రాములు, సిద్దన్న, మోతిలాల్, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జ్, కూన సంతోష్ కుమార్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఏకైక నాయకురాలు ఇందిరాగాంధీ: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
Published On: November 19, 2025 6:26 pm