సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): నూతన ఎక్సైజ్ పాలసీ నిబంధనలను అనుసరిస్తూ సంగారెడ్డి జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపును పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. జిల్లాలో 2025- 2027 సంవత్సరం వరకు కొనసాగనున్న మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ సోమవారం సంగారెడ్డి పట్టణంలోని జె.ఎస్.ఆర్. గార్డెన్‌లో లాటరీ పద్ధతిలో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 101 మద్యం షాపుల కేటాయింపుకు గాను మొత్తం 4,432 దరఖాస్తులు అందాయని, 100 మద్యం షాపులకు సంబంధించి ఒక్కో షాపు వారీగా దరఖాస్తుదారులను ఆహ్వానించి, వారి సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారని అన్నారు. 100 షాపుల కేటాయింపు పూర్తయిందని, ఈ కార్యక్రమం మొత్తం ఫోటో, వీడియో చిత్రీకరణతో సజావుగా జరిగినట్లు కలెక్టర్ తెలిపారు. షాపు నంబర్–24 కు సంబంధించి తక్కువ దరఖాస్తులు అందిన నేపథ్యంలో, ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు రీ–నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరు కావడంతో టోకెన్ కలిగిన వారిని మాత్రమే లోపలికి అనుమతించారని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు. ఎక్సైజ్అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా ప్రశాంతంగా కొనసాగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జె. హరికిషన్, సూపరింటెండెంట్ నవీన్ చంద్ర, ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పారదర్శకంగా మద్యం దుకాణాలకు లక్కీ డ్రా: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Oplus_16908288