సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఉన్నతాధికారుల ఆదేశాలను లెక్కచేయకుండా తన ఇష్టానుసారంగా సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు–1 నిర్వహించిన ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాధికారి (డీఈఓ) వెంకటేశ్వర్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం డేగుల్వాడి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యా శాఖ జారీ చేసిన షెడ్యూల్‌ను పట్టించుకోకుండా స్వయంగా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై మండల విద్యాధికారి (ఎంఈఓ) సమగ్ర విచారణ జరిపి నివేదికను డీఈఓకు సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా డీఈఓ వెంటనే చర్యలు తీసుకుని ప్రధానోపాధ్యాయురాలిని విధుల నుండి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అధికారులు నిర్దేశించిన సమయ పట్టిక ప్రకారం మాత్రమే పరీక్షలు జరగాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ అధికార ఆదేశాలను అతిక్రమించరాదని హెచ్చరించారు. విద్యా ప్రమాణాలను కాపాడేందుకు, బోధన-పరీక్షల ప్రక్రియలో క్రమశిక్షణ తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు.
సమ్మేటివ్ పరీక్షలు ఇష్టానుసారంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్
Published On: October 31, 2025 5:10 pm