బిక్నూరులో ₹92.80 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం
రైతే రాజు… గ్రామీణ ఆర్థిక బలానికి మార్కెట్ యార్డుల అభివృద్ధి కీలకం: మంత్రి సీతక్క
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 20
“జై కిసాన్ – జై జవాన్… రైతును రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం” అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బిక్నూర్ మండలంలో మొత్తం ₹92.80 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. మండలం మార్కెట్ యార్డ్‌లో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి సీతక్కతో పాటు ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షత్కార్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొని పునాది రాళ్లు ఉంచారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంప్లెక్స్‌లో 11 షాపులు, మీటింగ్ హాల్, టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగినట్లు తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని, రైతులు పండించే ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తోందని అన్నారు.వ్యవసాయం బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టిందని సీతక్క స్పష్టం చేశారు.