Site icon PRASHNA AYUDHAM

ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్.. డ్రైవర్ల సంక్షేమం బోర్డు ఏర్పాటు చేస్తాం

IMG 20251005 WA0077

ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్

డ్రైవర్ల సంక్షేమం బోర్డు ఏర్పాటు చేస్తాం

ఆటోలపై జరిమానాల భారం తగ్గిస్తాం

ప్రభుత్వం చేసే మంచి పనిని డ్రైవర్లే ప్రజల్లోకి తీసుకెళ్లాలి

పరదాలు కట్టుకుని రాలేదు… దర్జాగా ఆటోలో వచ్చాం

చెడుపై మంచి సాధించిన విజయమే పండుగల స్ఫూర్తి

దుష్టులు మళ్లీ రాకూడదు… అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదు

ఆటో డ్రైవర్ సేవలో…’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

2.90 లక్షల డ్రైవర్ల ఖాతాల్లో రూ.436 కోట్ల జమ

క్యాంప్ ఆఫీసు నుంచి సభా ప్రాంగణం వరకు 14 కిలోమీటర్ల దూరం ఆటోలో ప్రయాణించిన సీఎం

వేర్వేరు ఆటోల్లో సభా ప్రాంగణానికి వచ్చిన డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్

విజయవాడ,  : ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించి లబ్దిదారులకు చెక్కులు అందించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ. 15 వేలు వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేశారు. రాష్ట్రంలోని 2,90,669 మంది డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.436 కోట్లు జమ చేశారు. సభా ప్రాంగణంలో డ్రైవర్లు అందించిన ఖాకీ చొక్కాలను ధరించి సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ…”కూటమి పాలనలో ప్రజల కష్టాలు తీరాయి. సంక్షేమం దరిచేరింది. ఉబర్, ర్యాపిడో వంటి యాప్ లు ఉన్నాయి. వీటి ద్వారా ఆటో డ్రైవర్లు కొంత మేర ఇబ్బంది పడుతున్నారు. వాటిని ప్రభుత్వం కంట్రోల్ చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఆటో డ్రైవర్ల కోసం ఓ యాప్ తెస్తాం. ఆ యాప్ ద్వారా ఆటో డ్రైవర్లకు బుకింగ్ లు వచ్చేలా చూస్తాం. కిరాయి కోసం ఆటో స్టాండుకు వెళ్లి పడిగాపులు పడే అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా సహకారం అందిస్తాం. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి యాప్ ద్వారా మీకు అవకాశాలు దొరికేలా చేస్తాం. యాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసమే ఖర్చు పెడతాం. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి… ఆటో డ్రైవర్ల భవిష్యత్తును మరింత మంచిగా తీర్చిదిద్దేలా పనిచేస్తాం. ఆటో, మాక్సి క్యాబ్, క్యాబ్ డ్రైవర్లందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసమే ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఎవరికి లంచాలు ఇవ్వకుండా, కార్యాలయాలకు తిరగకుండా అర్హుల అందరి బ్యాoక్ ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. అర్హులు ఏ ఒక్కరికి డబ్బులు జమ కాకపోయినా ప్రభుత్వానికి చెప్పండి… ఆర్హతను బట్టి ఖాతాలో వేస్తాం.”అని సీఎం చెప్పారు.

గుంతలు పూడ్చాం… ఆటో రిపేర్ల ఖర్చు తగ్గించాం

“గత పాలకులు రోడ్లను అస్సలు ఏ మాత్రం పట్టించుకోలేదు… ధ్వంసం చేశారు. మేం వచ్చేసరికి రోడ్లన్నీ గుంతలు పడ్డాయి. గత పాలకుల హయాంలో వాహనాల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనం అయ్యేది. ఆటోల రిపేర్లకే ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్ల రిపేర్లపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాం. రాష్ట్రంలో 23 వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు చేసి గుంతలు లేని రోడ్లను తయారు చేశాం. దీంతో వాహనాలు సాఫీగా సాగుతున్నాయి. రిపేర్లు ఖర్చు తగ్గింది. గతంలో ఆటోలపై పెద్ద ఎత్తున జరిమానాలు విధించేవారు. అనవసరంగా ఉన్న జరిమానాల జీవోలను రద్దు చేస్తాం. చలనా విధానాన్ని సరళీకృతం చేయటంతో పాటు ఆటోలను ఈవీలుగా మారుస్తాం.. దీనికి ప్రభుత్వం సహకరిస్తుంది. ఆటో, మాక్సి, క్యాబ్ డ్రైవర్లు క్రమశిక్షణగా ఉండాలి. ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించవద్దు… ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. ప్రజలను ఇబ్బంది పెట్టకండి. మీరు సహకరిస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది.” అని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పండి

“ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆర్ధిక సాయం డ్రైవర్ల ఖాతాల్లో పడ్డాయి. డ్రైవర్లకు పండుగ. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. 15 నెలల్లో ప్రతీ పేదవాడి జీవితంలో మార్పు తెచ్చే దిశగా మెరుగైన పాలన అందిస్తూ వచ్చాం. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేస్తుంటే… ప్రధాని మోదీ సూపర్ జీఎస్టీ తెచ్చి ఆర్ధిక భారం తగ్గించారు. చెప్పిన పని చెప్పినట్లుగా చేసే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలో లేని సంక్షేమం సూపర్ 6 ద్వారా ఏపీలోనే అమలు చేస్తున్నాం. స్త్రీశక్తి పథకం ద్వారా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే స్వేచ్ఛ ఇచ్చింది. ఆటో డ్రైవర్ కుటుంబంతో కలిసి ఇవాళ వేదిక వరకూ వచ్చాను… వారి కుటుంబం కష్ట సుఖాలను తెలుసుకున్నాను. అన్నా క్యాంటీన్లలో రూ.5కే ఆహారం పెడుతున్నాం. మధ్యాహ్నం పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. దసరా జరుపుకున్నాం… ఓజీ సినిమా చూశాం.. ఇప్పుడు ఆటో డ్రైవర్ల సేవలో ఉన్నాం. ఇలా నిత్యం ఏదోక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమం చేపడుతూనే ఉన్నాం. ఆటోడ్రైవర్ల ఇంట్లో ఆడబిడ్డలు కూడా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఉచిత బస్సు ప్రయాణం వాడుకోవచ్చు. స్త్రీ శక్తి పథకం బంపర్ హిట్ అయ్యింది. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలో అందరికీ ఉచిత ఆరోగ్య బీమా కల్పించాం. 25 లక్షల వరకూ పేదలకు ఉచిత వైద్య సేవలు అందుతాయి. డ్రైవర్ల కోసమే కాదు… ప్రజలందరికీ మంచి జరిగేలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. మంచి చేస్తోన్న కూటమి ప్రభుత్వం గురించి డ్రైవర్లంతా ప్రజలకు వాస్తవాలు వివరించాలి. మంచి చేస్తున్న ప్రభుత్వం గురించి పది మందికి చెప్పండి. ప్రజలంతా ఆనందంగా ఉండటమే కూటమికి కావాల్సింది.” అని సీఎం వివరించారు.

దసరా, దీపావళి పండుగలే స్పూర్తి

“దుష్టశక్తులను అంతం చేసినందుకు దసరా, దీపావళి పండుగలు జరుపుకుంటాం. ఈ పండుగలను మనం స్పూర్తిగా తీసుకోవాలి. మన సంస్కృతిలో భాగమైన పండుగల్ని ఉత్సాహంతో చేసుకోవాలి. ఆ పండుగల సారాంశాన్ని గ్రహించాలి. రాష్ట్రానికి మళ్లీ దుష్ట శక్తులు రాకుండా జాగ్రత్త పడాలి. ఈ పండుగలు నేర్పించే పాఠాలను అర్థం చేసుకోవాలి. 16 నెలల క్రితం వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి. పాలన ఎక్కడికక్కడ ఆగిపోయింది. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను కూడా గత పాలకులు నడవనీయలేదు. 16 నెలల క్రితం వరకూ పరదాలు కట్టుకుని, గోతులు తవ్వారు. ప్రజల్ని భయాందోళనలో ఉంచారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. పేదల సంక్షేమంలోనూ డబ్బులు బొక్కేసిన వాళ్లు రాజకీయానికి పనికిరారు. ఇలాంటి దుష్టశక్తులు రాకుండా, ప్రజలకు చెడు జరగకుండా కాపాడుకోవాలి. మనకు ఇక ఈ వైకుంఠపాళి వద్దు. గుజరాత్ లో 25ఏళ్లుగా ఉన్న సుస్థిర పాలనను స్ఫూర్తిగా తీసుకోవాలి. కేంద్రంలో 15ఏళ్లుగా ఎన్డీఏ ఉన్నందునే ప్రజల కష్టాలు తీరాయి. వైకుంఠపాళీ వల్ల రాష్ట్రానికి ఇబ్బందులే

అందుకే అలాంటి వారి పాలన మనకు వద్దు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అభివృద్ధి. 16 నెలల కాలంలో వ్యవస్థలను గాడిలో పెట్టాం. సంపద సృష్టించి పేదలకు పంచుతూ సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గతంలో మాదిరిగా పరదాలు కట్టుకుని రాలేదు… ఆటోలో దర్జాగా వచ్చాం. 2024లో జరిగిన ఎన్నికలు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో ఈ స్ట్రైక్ రేట్ ఇంకా పెరగాలి.” అని ముఖ్యమంత్రి చెప్పారు.

కష్ట, సుఖాలు తెలుసుకుంటూ ఆటోలో ప్రయాణం…

సీఎం చంద్రబాబు తన నివాసం నుంచి సభా ప్రాంగణం వరకు ఆటోలో ప్రయాణించారు. సుమారు 14 కిలోమీటర్ల దూరం సీఎం ఆటోలో ప్రయాణించారు. ముఖ్యమంత్రితో పాటు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ వేర్వేరుగా ఆటోల్లో ప్రయాణించి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్ సేవలో పథకం లబ్దిదారుల కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, మాధవ్ ఆటోల్లో ప్రయాణించారు. వారి కుటుంబ స్థితిగతులను నేతలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నామని సీఎం అడిగిన ఓ ప్రశ్నకు ఆటో డ్రైవర్ అఫ్సర్ ఖాన్ సమాధానమిచ్చారు. ఆటో ద్వారా ప్రజలను, ప్రయాణికుల్ని గమ్య స్థానాలకు చేరుస్తూ చేస్తున్న సేవ అభినందనీయమని సీఎం బదులిచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని సీఎం హామీ ఇచ్చారు. తల్లికి వందనం, దీపం-2.0 వంటి పథకాలు అందాయా…, రేషన్ ద్వారా బియ్యం తీసుకుంటున్నారా అని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లలను చక్కగా చదివించుకోవాలని… పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంచేలా చూడాలని ఆటో డ్రైవర్ అఫ్సర్ ఖాన్ దంపతులకు సీఎం సూచించారు. ఆటోల్లో వెళ్తున్న చంద్రబాబును, ఇతర నేతలను చూసి ప్రజలు సంతోషంతో కేరింతలు కొట్టారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ నేతలు ముందుకు కదిలారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కాళేశ్వరరావు మార్కెట్, ఏలూరు లాకులు, ముత్యాలంపాడు గవర్నమెంటు ప్రెస్ మీదుగా సీఎం సహా ఇతర నేతలు ఆటోల్లో ప్రయాణించారు. ఆటోల్లో సభా ప్రాంగణానికి చేరుకోగానే ప్రయాణానికి సంబంధించిన డబ్బులను ఆటో డ్రైవర్లకు చంద్రబాబు, ఇతర నేతలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ, రవాణ శాఖ ఉన్నతాధికారులు సహా స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version