Site icon PRASHNA AYUDHAM

ఆధికారుల నిర్లక్ష్యం.. దుర్వాసనలో మునిగిన దేవునిపల్లి 

IMG 20251001 WA0007

ఎల్లారెడ్డి, అక్టోబర్ 1, (ప్రశ్న ఆయుధం):

ఎల్లారెడ్డి పట్టణం నాలుగవ వార్డు పరిధిలోని దేవునిపల్లి గేటు వద్ద మున్సిపల్ సిబ్బంది చెత్తను పారవేయడంతో ఆ ప్రదేశం డంపింగ్ యార్డుగా మారిపోయింది. పట్టణంలోని పలు వార్డుల నుంచి సేకరించిన చెత్తను గేటు వద్ద కాల్వ ప్రక్కన పడేస్తున్నారని స్థానికులు బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఇది ఊరా లేక డంపింగ్ యార్డా..? పన్నులు వసూలు చేయడంలో మీరు ముందుంటారు. కానీ ప్రజలకు సౌకర్యాలు కల్పించడం, ఆరోగ్య పరిరక్షణలో మాత్రం బాధ్యత ఎక్కడ..?” అని గ్రామస్థులు ప్రశ్నించారు. ఒకవైపు తడి–పొడి చెత్త వేరు చేయమని అవగాహన కల్పిస్తూనే, మరోవైపు ఊరి గేటు వద్దే చెత్తను పోయడం ఎంతవరకు సమంజసం అని వారు మండిపడ్డారు.

దుర్వాసన, దోమల వల్ల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని, వెంటనే చెత్త పారవేతను ఆపి అక్కడి చెత్త మొత్తాన్ని తొలగించాలని గట్టిగా డిమాండ్ చేశారు. “మా ఆరోగ్యాన్ని పణంగా పెట్టే ఈ చర్యలకు ఎవరు సమాధానం చెబుతారు..? సమస్య పరిష్కరించకపోతే మున్సిపల్ వద్ద తీవ్ర ఆందోళనకు దిగుతాం” అని హెచ్చరించారు.

Exit mobile version