వైన్ షాప్ టెండర్లలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలి
బినామీల ఆధిపత్యం నివారించాలని అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 6
జిల్లాలో గల 49 వైన్ షాపుల టెండర్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ టెండర్లలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కామారెడ్డి జిల్లా శాఖ డిమాండ్ చేసింది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పెద్ద మొత్తంలో షాపులను దక్కించుకుని ఆధిపత్యం చెలాయిస్తున్నారని, ఎస్సీ రిజర్వు షాపులకూ బినామీ పేర్లతో టెండర్లు వేయించి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని సంఘం నాయకులు పేర్కొన్నారు.
ఈ వ్యవస్థ వల్ల కొత్త వారికి ఉపాధి అవకాశాలు దూరమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి టెండర్లలో పాత ఆధిపత్యం కొనసాగకుండా కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరుతూ, అంబేద్కర్ యువజన సంఘం తరఫున ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్‌లో అధికారులకు ఫిర్యాదు సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టెంకి బాల్ రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు తమ్మడి స్వామి పాల్గొన్నారు.