ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు 

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు 

 కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 30 

 

జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Election Code) పకడ్బందీగా అమల్లో ఉందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ మందిరంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల కోడ్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు రెండు విడతల్లో జరుగనున్నాయని తెలిపారు.

ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించామని, పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లను కూడా ఇప్పటికే నియమించామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోస్టర్లు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలను తొలగించనున్నట్లు తెలిపారు. కొత్తగా ఏవైనా పోస్టర్లు, ప్రకటనలు వేయాలంటే ముందుగా అనుమతులు తప్పనిసరిగా పొందాలన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఆర్డీఓ నుంచి, సర్పంచ్, వార్డు మెంబర్లకు తహశీల్దార్ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు.

ఎన్నికల ఖర్చు పరిమితులను కూడా కలెక్టర్ వివరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు 5 వేల పైగా జనాభా ఉన్న గ్రామాల్లో రూ.2.5 లక్షలు, 5 వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో రూ.1.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చన్నారు. సర్పంచ్ అభ్యర్థులు రూ.50 వేల వరకు, వార్డు సభ్యులు రూ.30 వేల వరకు మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రూ.50 వేల కంటే ఎక్కువ నగదు వాహనదారుల వద్ద ఉంటే సీజ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. అలాగే ఎన్నికలకు 48 గంటల ముందు నుంచే ప్రచారం నిలిపివేయాలని తెలిపారు.

Join WhatsApp

Join Now