ఎల్లారెడ్డి వాసి మున్నం శశి కుమార్ కు గ్రూప్-1 ఉద్యోగం- అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్‌గా యువతకు స్ఫూర్తి!

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 29, (ప్రశ్న ఆయుధం):

ఇటీవల విడుదలైన తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 98వ ర్యాంక్, మల్టీ జోన్‌లో 54వ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పదవిని చేపట్టిన ఎల్లారెడ్డి వాసి మున్నం శశి కుమార్, ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

శశి కుమార్ ఉపాధ్యాయ వృత్తిలో 20 ఏళ్లు కొనసాగుతూ, పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందిన తర్వాత గ్రూప్-1 లక్ష్యాన్ని సాధించారు. ఆయన విద్యాభ్యాసం ఎల్లారెడ్డి ప్రాంతంలో ప్రారంభమై, 1996లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 10వ తరగతి పూర్తి చేశారు. తరువాత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, బాన్సువాడలోని ఎస్.ఆర్.ఎన్.కే డిగ్రీ పూర్తి చేశారు. దూరవిద్య ద్వారా డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో హిస్టరీలో గోల్డ్ మెడల్, ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు, భోజ్ యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తెలుగు, హిస్టరీలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీ పూర్తి చేసి 2024లో డాక్టరేట్ పొందారు.

ఉద్యోగ ప్రస్థానం 2005లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా ప్రారంభమైన శశి కుమార్, ప్రస్తుతం ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిస్టరీ బోధిస్తున్నారు. 20 ఏళ్ల కష్టంతో పాటు, ఎన్నో విఫల ప్రయత్నాల తరువాత కూడా ఆయన గ్రూప్-1లో విజయాన్ని సాధించడం స్ఫూర్తిదాయకం.

శశి కుమార్: “నా ప్రయాణం సాధారణం కాదు. ఉపాధ్యాయునిగా పని చేస్తూనే చదువులు, పరిశోధనలు కొనసాగించాను. వైఫల్యాలు నన్ను బలపరిచాయి తప్ప ఆపలేదు” అని చెప్పారు.

శశి కుమార్ సాధన యువతకు, ఉద్యోగార్థులకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది. పట్టుదలతో ఏదైనా సాధ్యమే అని నిరూపించిన ఆయన ఎల్లారెడ్డి ప్రాంతానికి గర్వకారణం.

Join WhatsApp

Join Now