నిజామాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 28 (ప్రశ్న ఆయుధం):
నగరంలోని బ్రాహ్మణ్ కాలనీ, నాగారంలో ఇటీవల చోటు చేసుకున్న భారీ దొంగతనానికి సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, దాదాపు 31 తులాల బంగారు ఆభరణాలు, నేరంలో ఉపయోగించిన ఆటో, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు జోరుగా కొనసాగుతోంది.
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ పి. సాయి చైతన్య ఐ.పి.ఎస్ వివరాలు వెల్లడించారు.
కేసు వివరాలు:
సెప్టెంబర్ 23న బ్రాహ్మణ్ కాలనీకి చెందిన వేలేటి పవన్ శర్మ అనే పౌరోహిత్యం వృత్తి చేసుకునే వ్యక్తి తన కుటుంబంతో కలిసి దుర్గమత పూజకై వెళ్లగా, ఇంటికి తాళం వేసి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి చొరబడి 33 తులాల బంగారం, 25 తులాల వెండి, రూ.30 వేలు నగదు అపహరించినట్లు టౌన్-5 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ముఠా వివరాలు:
దర్యాప్తులో ఐదుగురు వ్యక్తులు కలిసికట్టుగా ముఠా ఏర్పాటుచేసి, దొంగతనాలు చేయడం ద్వారా అర్ధిక అవసరాలను తీరుస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ ముఠాకు నాయకుడిగా ఉన్న షేక్ సాదక్ (A1), అతనితో పాటు వినోద్ చౌహాన్ (A2), ముక్తే సాయినాథ్ (A3), షేక్ సల్మాన్ అలియాస్ సోనూ (A4), మరాటి ఆకాశ్ (A5) దొంగతనాల్లో పాల్గొన్నారు.
ఈమధ్య జరిగిన దొంగతనంలో, ఆటోలో వచ్చి ఇంటికి తాళం వేసి ఉన్నదని గమనించి, ఇద్దరు నిందితులు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి, ఆభరణాలు, వెండి సామగ్రి, నగదు దొంగిలించారు. మిగిలిన నిందితులు బయట కాపలా ఉన్నారు.
అరెస్టు వివరాలు:
ఉదయం విశ్వసనీయ సమాచారం ఆధారంగా, డబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ చౌరస్తా వద్ద షేక్ సల్మాన్ (A4), మరాటి ఆకాశ్ (A5) అనుమానాస్పదంగా కనిపించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి:
బంగారు ఆభరణాలు: మామిడి హారం, పతకాల హారం, నల్ల పూసల హారం, నెక్లేస్‌లు, గాజులు, కంకణాలు, కీవులు, పాపిడి బిళ్ళ, బ్రేస్‌లెట్, రుద్రాక్ష, ఉంగరాలు, ఓం ఆకారంలో ఉన్న లాకెట్, ముక్కుపోగు మొదలైనవి
(మొత్తం దాదాపు 31 తులాలు)
వాహనం: నేరంలో ఉపయోగించిన ఆటో (TG 16 T 2950)
ఇతర వస్తువులు: నిందితుడి మొబైల్ ఫోన్
పోలీసు అధికారులు కేసును వివిధ కోణాల్లో పరిశీలించి, నిందితుల్ని పట్టుకోవడంలో విజయం సాధించారు. మిగిలిన నిందితులు షేక్ సాదక్, వినోద్ చౌహాన్, ముక్తే సాయినాథ్‌లు పరారీలో ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ కేసు విచారణను అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎల్. రాజా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. శ్రీనివాస్, ఎస్.ఐ ఎం. గంగాధర్, క్రైమ్ టీమ్, టౌన్-5 పోలీస్ స్టేషన్ సిబ్బంది ముమ్మరంగా చేపట్టి కీలక నిందితులను అరెస్టు చేశారు.
నిందితులను అరెస్టు చేసిన పోలీస్ సిబ్బందిని కమిషనర్ ఆఫ్ పోలీస్ పి. సాయి చైతన్య ఐ.పి.ఎస్ అభినందించారు.