నిజామాబాద్, సెప్టెంబర్ 29 (ప్రశ్న ఆయుధం) నిజామాబాద్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించాయి. ఆదివారం సాయంత్రం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అనునిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసులు ఈసారి బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి చిన్నా–పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆడిపాడారు. దీంతో పోలీసు శాఖలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తమ కుటుంబ సభ్యులతో హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పోలీసు శాఖ మహిళా సిబ్బంది పాటలు పాడుతూ బతుకమ్మలను తిప్పడంతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధికారులు, సిబ్బంది అందరూ సంబురాల్లో ఆనందంగా పాల్గొన్నారు.