Site icon PRASHNA AYUDHAM

ప్రజలకు మంచి వైద్యం అందించాలి: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టి.నర్సారెడ్డి

IMG 20251008 142125

Oplus_131072

సిద్దిపేట/గజ్వేల్, అక్టోబర్ 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): గజ్వేల్ పట్టణంలోని ప్రజ్ఞాపూర్ లో అతిధి ఆసుపత్రి పునఃప్రారంభ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ.. వైద్యో నారాయణ హరి… దేవుడు తర్వాత ప్రజలకు ప్రాణదాతగా నిలిచేది డాక్టర్‌నే అని, వైద్య వృత్తి సేవతో నిండినదని తెలిపారు. ఈ ఆసుపత్రి గజ్వేల్ పట్టణ ప్రజలకు ఎంతో అవసరమైన వైద్య సదుపాయాలను అందించగలదని అన్నారు. గజ్వేల్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంలో ఆధునిక వైద్య సదుపాయాలతో పెద్ద ఆసుపత్రి తిరిగి వాడుకలోకి రావడం సంతోషకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల మన్ననలు పొందుతూ, రోగులకు స్నేహపూర్వకంగా, నిబద్ధతతో వైద్యం అందించాలని వైద్యులు, సిబ్బందిని కోరారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తే అదే నిజమైన సేవ అవుతుందని, డబ్బుకంటే మనసుతో చేసే వైద్యం ప్రజల ఆశీర్వాదం తెస్తుందని నర్సారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు తుంకుంట నర్సారెడ్డిని సన్మానం చేశారు. కార్యక్రమంలో వైద్యులు, గజ్వేల్ ఏఎంసీ మార్కెట్ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Exit mobile version