ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో విషాద ఘటన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధ సెప్టెంబర్ 29
ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వేధింపులను తట్టుకోలేక ఓ యువకుడు ప్రాణం తీసుకున్న దుర్ఘటన మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. భవన నిర్మాణ లేబరుగా పనిచేస్తున్న రమేష్ (35) గత సంవత్సరం జూలైలో కామారెడ్డి కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ వద్ద ఇంటి మీదుగా రూ.6 లక్షల రుణం తీసుకున్నాడు. ప్రారంభంలో ఈఎంఐలు చెల్లించిన రమేష్, ఆర్థిక ఇబ్బందులతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల వాయిదాలను చెల్లించలేకపోయాడు.దీంతో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు తరచుగా ఫోన్లు చేసి వేధించడంతో పాటు, రమేష్ ఇంటి గోడపై ‘ఈ ప్రాపర్టీ లీగల్ ప్రాసెస్‌లో ఉంది, లావాదేవీలు జరపరాదు’ అనే నోటీసు రాశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేష్ ఆదివారం ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.రమేష్ భార్య సంధ్య మాట్లాడుతూ.. తన భర్తను ఫైనాన్స్ సంస్థ వేధింపులే ప్రాణాలు తీసాయని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రమేష్‌కు కుమారుడు అశ్విత్, కుమార్తె ఆద్య ఉన్నారు.