వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన కలెక్టర్
— జిల్లా వ్యాప్తంగా 427 కేంద్రాలు
— రైతులకు అన్ని వసతులు కల్పిస్తాం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 4
జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ శనివారం దోమకొండ మండలంలోని గొట్టిముక్కల గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వానాకాలం సీజన్‌లో పండించిన వరి ధాన్యం కొనుగోలు కోసం జిల్లావ్యాప్తంగా 427 కేంద్రాలను ప్రారంభించామని, వాటిలో 194 కేంద్రాలను డీఆర్డీఏ ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టార్పాలిన్ కవర్లు, వేయింగ్ మిషన్లు, తేమ కొలిచే పరికరాలు, గన్ని బ్యాగులు వంటి మౌలిక వసతులు సమకూర్చామని చెప్పారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే పేమెంట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సురేందర్, డీసీఎస్ఓ వెంకటేశ్వరరావు, డీఎం సివిల్ సప్లై శ్రీకాంత్, స్థానిక తాసిల్దార్, ఎంపీడీవో, ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.