Site icon PRASHNA AYUDHAM

వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు తక్షణ చర్యలు ప్రారంభించాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

IMG 20251013 185339

Oplus_131072

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు తక్షణ చర్యలు చేపట్టాలని, జిల్లాలో రోడ్డు రవాణా సౌకర్యాలు లేని గిరిజన తండాలకు వెంటనే రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రధాన రోడ్లతో ఆ గిరిజన తండాలు అనుసంధానమయ్యేలా వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతిలతో కలిసి గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులు, మట్టి రోడ్లను త్వరితగతిన మరమ్మతు చేసి, రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు కలుగ కుండా పునరుద్ధరించాలని కలెక్టర్ సూచించారు. ఎస్టీ–ఎస్‌డిఎఫ్ నిధులు సమర్థవంతంగా వినియోగించి, రహదారి కనెక్టివిటీ కల్పించాలని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా పంచాయతీరాజ్ విభాగం నుండి మంజూరైన రహదారుల పనులకు టెండర్ ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పాడైపోయిన రోడ్లు, కల్వర్ట్స్ లకు ఉపాధి హామీ పథకం కింద ప్రతిపాదనలు తీసుకుని తక్షణమే పనులు ప్రారంభించాలని సూచించారు. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను కూడా సమీక్షించారు. గిరిజన తండాలకు రహదారి కనెక్టివిటీ, అన్ని ప్రధాన తండాలలో రహదారులు అందుబాటులోకి వచ్చేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులు, కొనసాగుతున్న రోడ్ పనులపై వివరాలను అధికారులు సమర్పించారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఆర్ అండ్ బి డివిజనల్ ఇంజనీర్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగాధిపతులు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version