సంచలన నిర్ణయాలతో డొనాల్ట్ ట్రంప్ పాలన ప్రారంభం..*
ప్రమాణ స్వీకారం అనంతరం సంచలన నిర్ణయాలతో డొనాల్ట్ ట్రంప్ పాలన ప్రారంభం అయింది. సుమారు 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లు, విధానపరమైన నిర్ణయాలతో తనదైన శైలిలో పాలన షురూ చేశారు.
ప్రభుత్వంలోని నలుగురు సీనియర్ అధికారులపై వేటు వేశారు. మరో వెయ్యి మందిని ఉద్యోగాల నుంచి తీసివేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
ప్రపంచ ఆరోగ్యసంస్థ WHO నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చారు.
మెక్సికో, కెనడా వస్తూత్పత్తులపై ఫిబ్రవరి 1 నుంచి 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తెలిపారు. టిక్‌టాక్‌కు మరో 75 రోజులు గడువు ఇస్తూ ట్రంప్ సంతకం చేశారు.
2021 జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్‌పై దాడి కేసులో.. తన మద్దతుదారులైన 1500 మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
అమెరికాలో రెండు జెండర్లే ఉంటాయని.. స్త్రీలు పురుషులుగానే గుర్తిస్తామన్నారు ట్రంప్. అలాగే అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులకు పుట్టబోయే పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
యుద్ధాలు చేయడం తన విధానం కాదంటున్నారు ట్రంప్. యుద్ధాలు ఆపుతానని తేల్చిచెప్పారు. అంతేకాదు రష్యా-ఉక్రెయిన్ వార్ ఆపేబాధ్యత తీసుకున్నారు. శాంతి సమాధానాల ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అన్నారు.