జర్నలిస్టుల పిల్లలకు వంద శాతం ఫీజు రాయితీ ఇవ్వాలి: టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని కల్పించాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి కోరారు. సోమవారం సంగారెడ్డిలో డీఈవో వెంకటేశ్వర్లును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ఉపాధ్యక్షుడు ఎంఏకే.ఫైజల్, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమానికి తమ సంఘం పాటు పడుతుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో చాలా మంది జర్నలిస్టులు తమ కుటుంబాన్ని కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. పేద, మధ్యతరగతి వర్గాల వారే ఎక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారని తెలిపారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో వారి పిల్లలకు ఫీజు రాయితీ కల్పించడం ద్వారా ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. అంతే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా అర్హులైన వారికి అందించాలని విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు విద్యాసంస్థల్లో నూటికి నూరు శాతం ఫీజు రాయితీని జర్నలిస్టుల పిల్లలకు కల్పించాలని డీఈవోను కోరారు. గతంలో కొందరు ప్రైవేటు విద్యా సంస్థలు డీఈవో ఉత్తర్వులను కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ఈసారి ఆ విధంగా కాకుండా కచ్చితంగా ప్రతి విద్యా సంస్థలు అమలు చేసే విధంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి డీఈఓ వెంకటేశ్వర్లు సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టు పిల్లలకు నూటికి నూరు శాతం రాయితీని అందే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షుడు మహమ్మద్ సిద్ధిక్, ఫోటో జర్నలిస్టుల సంఘ నాయకుడు ఆరిఫ్, సీనియర్ జర్నలిస్టులు రవి, పరంజ్యోతి, నాగరాజుగౌడ్, శ్యాంసుందర్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment