బాలయ్య… వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు మీ సేవలకు దక్కిన గుర్తింపు
తెలుగు వాళ్లందరికీ గర్వకారణం
అర్ధ శతాబ్దానికి పైగా హీరోగానే కొనసాగుతుండటం గొప్ప విషయం
బసవతారకం తో క్యాన్సర్ రోగులకు అందిస్తున్న సేవలు మరువలేనివి
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు
గ్లామర్ ప్రపంచంలో అర్ధశతాబ్దానికిపైగా హీరోగా కొనసాగడం అరుదైన విషయమని, ఆ ఘనత హీరో బాలక్రిష్ణకు దక్కిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. వయసు మీద పడినా వన్నె తగ్గలేదని నిరూపిస్తూ హీరో బాలయ్య చేస్తున్న ప్రయాణం ‘‘అన్ స్టాపబుల్’’అని వ్యాఖ్యానించారు. సినిమాల్లోనూ కాకుండ నిజజీవితంలోనూ బాలక్రిష్ణ అందిస్తున్న సేవలు మరువలేనివని అన్నారు. బసవ తారకం ఆసుపత్రిని స్థాపించిన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వేలాది మంది క్యాన్సర్ రోగులకు కాపాడుతున్నారని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా ఎమ్మెల్యేగా అన్ స్టాపబుల్ జర్నీని కొనసాగిస్తున్నారని తెలిపారు. బాలక్రిష్ణ హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సాయంత్రం హైదరాబాద్ హైటెక్ సిటీలోని హోటల్ ట్రైడెంట్ లో జరిగిన ‘‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే’’ నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఏమన్నారంటే…
వయస్సేమో 65 ఏళ్లు…. మనిషిని చూస్తే పాతికేళ్ల ఏళ్ల ప్రాయం… ముఖంలో గాంభీర్యం… మాటల్లో భోళాతనం… అభిమానులకు ఆయనంటే తరగని అభిమానం…. క్యాన్సర్ రోగుల పాలిట దైవం… ఓటమి ఎరగని రాజకీయ విజయం కూడా మన బాలక్రిష్ణ సొంతం… అందరం ముద్దుగా పిలుచుకునే బాలయ్య 50 ఏళ్లపాటు అప్రతిహతంగా సినీ జర్నీని పురస్కరించుకుని ‘‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్’’ బుక్ లో చోటు దక్కడం తెలుగు వాళ్లందరికీ గర్వకారణం. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా బాలయ్య కావడం గొప్ప విషయం.
తండ్రి డాక్టర్ కావాలనుకుంటే… నందమూరి నట వారసత్వాన్ని ఒంటబట్టించుకుని యాక్టరైండు. ఆ…తండ్రిచాటు బిడ్డ, వారసత్వం ఎన్నాళ్లుంటుందిలే అనుకుంటే తాతమ్మ కల నుండి మంగమ్మగారి మనవడు దాకా, సమరసింహారెడ్డి నుండి అఖండ దాకా తన నటనతో ప్రేక్షకుల మనుసును దోచేసిన హీరో బాలక్రిష్ణ . తన నట, నిజ జీవితంలో అనేక సంక్షోభాలు ఎదురైనా వాటిని సవాళ్లుగా తీసుకుని అధిగమించారు. అందరికీ అనితర సాధ్యంకాని రీతిలో ఏకంగా అర్ధ శతాబ్దానికి పైగా హీరోగానే కొనసాగుతూ సినిమాల్లో నటించడం అరుదైన విషయం.
తొలి సినిమా ‘తాతమ్మ కల’ షూటింగ్ సందర్భంగా అలనాటి హీరోయిన్ భానుమతి రామక్రిష్ణ ‘‘ఈ అబ్బాయి చక్కగా నటించాడు. తండ్రి పేరు నిలబెడతాడు’’అని ఏ ముహూర్తాన అన్నారో కానీ… అద్బుతమైన నటనతో తండ్రికి తగ్గ తనయుడిగా మారి నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ నంది అవార్డుసహా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న నందమూరి నటరత్నం కీర్తి కిరీటంలో ఈరోజు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ పేరిట మరో అరుదైన పురస్కారం చేరడం చాలా సంతోషంగా ఉంది.
టాలీవుడ్ లో ఎన్నో ప్రయోగాలు చేసిన నటుడు బాలక్రిష్ణ …. అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో నటించి ఆల్ రౌండర్ గా సత్తా చాటిన పరిపూర్ణ నటుడు. ‘సమరసింహారెడ్డి’తో ఫ్యాక్షన్ సినిమాలకు పురుడు పోసి కనకవర్షం కురించిన హీరో బాలక్రిష్ణ. సింహ, లెజెండ్, గౌతమిపుత్ర శాతకర్ణి, అఖండ, భగవంత్ కేసరి సినిమాలతో బాక్సాఫీసు బద్దలు కొట్టి వయసు మీద పడినా వన్నె తగ్గలేదని నిరూపించిన నందమూరి యువరత్నం మన బాలయ్య.
కళారంగానికి బాలయ్య చేసిన సేవలకు గాను భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘పద్మభూషణ్’ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరిస్తే…. ఎన్టీఆర్ నేషనల్ అవార్డుతో తెలంగాణ ప్రభుత్వం సన్మానించడం మనందరికీ సంతోషం. ఒక్క మాటలో చెప్పాలంటే గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య. తన తండ్రి గొప్పతనాన్ని, కష్టాన్ని, పేదల కోసం పడ్డ తపనను కొందరు తప్పుగా చిత్రీకరిస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళుతుంటే…. కథా నాయకుడు, మహా నాయకుడు పేరిట సినిమాలను తెరకెక్కించి దాదాపు 60 గెటప్ లతో నటించి మెప్పించి ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రజలకు చాటిచెప్పిన నందమూరి వారసుడు మన బాలయ్య.
నటుడిగానే కాదు, రాజకీయ జీవితంలోనూ రాణిస్తున్న నాయకుడు బాలక్రిష్ణ .
యాక్టింగ్ పై ఉన్న ప్రేమతో డాక్టర్ కాలేక పోయిన బాలక్రిష్ణ గారు తన తల్లి పేరిట ‘బసవ తారకం ఇండో అమెరికన్ వయసు మీద పడినా వన్నె తగ్గలేదని నిరూపించిన నందమూరి యువరత్నం మన బాలయ్య స్థాపించి వేలాది మంది క్యాన్సర్ రోగులకు ప్రాణం పోస్తూ వారిపాలిట దైవం గా మారి సమాజానికి తనవంతు సేవ అందిస్తూ జేజేలు అందుకుంటున్న బాలక్రిష్ణ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ రియల్ హీరో అని నిరూపించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి బారిన పడిన ఎంతో మందికి సంజీవిని లా మారిన బసవ తారకం ఆసుపత్రి సేవలు మరింతగా విస్తరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
చివరగా ఒక్కమాట చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తా. తెలుగు రాష్ట్రాల్లో యువతకు ఆనందమొచ్చినా, ఆవేశమొచ్చినా, ఆక్రోశమొచ్చినా వాళ్ల నోటి నుండి వెలువడే మాట ‘‘జై బాలయ్య’’. ఇది చాలదా బాలక్రిష్ణ గారికి ఉన్న క్రేజ్ ఏమిటో చెప్పడానికి. అట్లాంటి నటుడి పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడం ఆయనకు దక్కిన గౌరవానికి నిదర్శనం. నిండూ నూరేళ్లు హాయిగా జీవించాలని, చివరిదాకా హీరోగానే నటిస్తూ తెలుగు ప్రజలను రంజింప చేయాలని అమ్మవారిని కోరుకుంటున్నా.