ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా

ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా

కామారెడ్డిలో జెండా ఆవిష్కరణ – కార్మిక హక్కుల కోసం పోరాటం

 కొనసాగుతుందని వి.ఎల్. నరసింహారెడ్డి పిలుపు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్‌ 31

దేశంలోని ప్రాచీన కార్మిక సంఘం ఏఐటీయూసీ (AITUC) 106వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలో ఘనంగా కార్యక్రమం జరిగింది. కామారెడ్డి పాత వాటర్‌ సెక్షన్‌ సమీపంలో ఏఐటీయూసీ రాష్ట్ర సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది వి.ఎల్. నరసింహారెడ్డి గారు జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఐటీయూసీ దేశ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలోనే 1920 అక్టోబర్‌ 31న ఆవిర్భవించిందని, కార్మిక హక్కుల రక్షణ కోసం 105 ఏళ్లుగా నిరంతర పోరాటం సాగిస్తోందని తెలిపారు. బ్రిటిష్ పాలనలో కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ చరిత్రాత్మక పోరాటాలు జరిపిందని ఆయన గుర్తుచేశారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మిళితం చేయడం తప్పు అని, ఆ చట్టాలను రద్దు చేసి పాత చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం ₹26 వేలుగా నిర్ణయించి, అన్ని కార్మికులకు పని భద్రత కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను శాశ్వతం చేయాలని, స్కీమ్‌ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సూచించారు.

అసంఘటిత కార్మికుల సంక్షేమానికి సమగ్ర బోర్డు ఏర్పాటు చేయాలని, రైతు–కార్మిక–ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి. బాలరాజ్, గౌరవ జిల్లా అధ్యక్షుడు ఎల్. దశరథ్, మున్సిపల్ అధ్యక్షుడు ఆర్. నర్సింగ్‌రావు, జిల్లా నాయకులు ఆర్. లక్ష్మణ్, జి. రాజు, సుదర్శన్, రాజిరెడ్డి, ఎం.డి. కరీముద్దీన్, బి. గంగాధర్, మెడికల్ ఎంప్లాయీస్‌, సివిల్ సప్లై కార్మిక సంఘాల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment