*నిర్మాణం లోని 11 విల్లాలు నేలమట్టం*
రాజధాని హైదరాబాద్‌లో హైడ్రా మరోసారి యంత్రాలకు పనిచెప్పింది. చెరువుల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపింది. మణికొండ మునిసిపాలిటీ పరిధి నెక్నాంపూర్ పెద్ద చెరువులో నిర్మాణంలో ఉన్న విల్లాలను శుక్రవారం నేలమట్టం చేసింది. అనుమతులు రద్దు చేసినా.. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో పనులు కొనసాగిస్తుండడంతో చర్యలు తీసుకుంది. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నెక్నాంపూర్ పెద్ద చెరువు ప్రాంతంలో పరిశీలించారు. అనంతరం చర్యలకు ఆదేశించారు. మరునాడే చెరువు వద్దకు చేరుకున్న అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. 13 విలాల్లకు గాను 11 పడగొట్టారు. రెండింటికి సంబంధించి కేసు ఉండడంతో కోర్టు దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు. కాగా, పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌లో 400 చదరపు గజాల విస్తీర్ణంలో ఒక్కో విల్లాను నిర్మిస్తున్నారు. గతంలోనే కొన్నిటిని సాగునీటి, పురపాలక అధికారులు కూల్చివేశారు. తదుపరి నిర్మాణం చేపట్టవద్దని నోటీసులిచ్చారు. కొన్నాళ్లు ఆపేసినా.. మళ్లీ పారంభించారు. స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన అధికారులు పూర్తిగా పరిశీలించి.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మిస్తున్నట్లుగా నిర్ధారించుకుని విల్లాలను నేలమట్టం చేశారు.