ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి – గూగుల్‌తో ఏపీ ఒప్పందం
వచ్చే ఐదేళ్లలో విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుందని ఆ సంస్థ ప్రకటించింది. ఢిల్లీలో గూగుల్, ఏపీ ప్రభుత్వం మధ్య ఏఐ హబ్ ఏర్పాటుపై ఒప్పందం జరిగింది. కేంద్ర మంత్రులు అశ్వని వైష్ణవ్, నిర్మలాసీతారామన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గూగుల్ ప్రతినిధులు విశాఖలో పెట్టుబడిపై తమ సంస్థ ఎంతో ఆసక్తిగా ఉందని.. వచ్చే ఐదేళ్లలో పదిహేను బిలియన్ డాలర్ల మేర ఖర్చుపెడతామని తెలిపారు.
గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫో టెక్ ద్వారా పది బిలియన్ డాలర్లు, నేరుగా గూగుల్ ద్వారా మరో ఐదు బిలియన్ డాలర్లు ఈ పెట్టుబడుల ప్రతిపాదనల్లో ఉన్నాయి. 2029 నాటికి డేటా సెంటర్ నిర్మాణం పూర్తవుతుందని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తెలిపారు. గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ ఉండబోతుందని … విశాఖ నుంచి 12 దేశాలతో సబ్ సీ-కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతాయని ప్రకటించారు. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారని గుర్తు చేశారు.
జెమినీ-ఏఐతో పాటు గూగుల్ అందించే ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయని పేర్కొన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత దేశానికే కాదు.. విశాఖ నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీ ఇచ్చేలా విశాఖ గూగుల్ డేటా సెంటర్ వేదిక కానుందని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ ప్రకటించారు.
అప్పట్లో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ ను ఆహ్వానించామని ఇప్పుడు గూగుల్ ను విశాఖకు తీసుకువస్తున్నామని తన రాజకీయ జీవితంలో ఇదో పెద్ద విజయం అని చంద్రబాబు ఉన్నారు. గ్లోబల్ టెక్ మ్యాప్‌లో ఏపీని నిలబెడతామని.. విశాఖ ఏఐ హబ్‌గా మారుతుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.