*పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్‌సహా 16 బిల్లులు..!!*
వాటిలో సహకార యూనివర్శిటీతో సహా ఐదు కొత్తవి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్‌సహా 16 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
వాటిలో ఐదు కొత్త బిల్లులు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జాబితా చేసింది. ఈ సమావేశాల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) తన నివేదికను సమర్పించిన తరువాత, ఉభయ సభల పరిశీలన, ఆమోదం కోసం వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును కూడా జాబితా చేసింది. ఐదు కొత్త బిల్లుల్లో సహకార యూనివర్శిటీ ఏర్పాటు చేయడం కూడా ఉంది.
వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన తరువాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)కి పంపిన వక్ఫ్ (సవరణ) బిల్లుపైనే అందరి దృష్టి ఉంటుంది. శీతాకాల సమావేశాల మొదటి వారం చివరి రోజున ప్యానెల్ తన నివేదికను సమర్పించడం తప్పనిసరి. వక్ఫ్ బిల్లును పరిశీలిస్తున్న జెపిసి పదవీకాలాన్ని పొడిగించాలని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే కోరడంతో ప్రస్తుత సెషన్‌లో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ బిల్లులో ప్రతిపాదించిన అనేక సవరణలను ప్రతిపక్షాలు, ముస్లిం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.
శీతాకాల సమావేశాల్లో ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ బిల్లును ప్రవేశపెడతారని ప్రచారం జరిగినా, జాబితాలో చేర్చలేదు. 11 పెండింగ్ బిల్లులతో సహా మొత్తం 16 బిల్లులు ప్రభుత్వం లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌లకు సమర్పించిన జాబితాలో భాగంగా ఉన్నాయి. మొత్తం మూడు బిల్లులు రాజ్యసభలోనూ, ఎనిమిది బిల్లులు లోక్‌సభలోనూ పెండింగ్ ఉన్నాయి. వీటితో పాటు జాబితా చేసిన కొత్త బిల్లుల్లో రాష్ట్రీయ సహకార విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లు, పంజాబ్ కోర్టుల (సవరణ) బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ పోర్టు బిల్లు ఉన్నాయి.వక్ఫ్ సవరణ బిల్లును జెపిసి రిపోర్టు ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంది.