*వణికిపోతున్న 3 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్*
*అమెరికాలో కొత్త బిల్లు…*
అమెరికాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్‌ను మరో కొత్త టెన్షన్ వెంటాడుతోంది. నిన్నమొన్నటి వరకు అక్రమవలసదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇప్పుడు సక్రమ పద్ధతిలో అమెరికా వెళ్లిన వారికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు.
అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదువు పూర్తి చేసుకున్న వారికి ఇచ్చే ఓపిటి ఆథరైజేషన్ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) విధానానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ట్రంప్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే అమెరికా పార్లమెంట్‌లో ఒక కొత్త బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఆ కొత్త బిల్లు అమలులోకి వస్తే అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) సబ్జెక్టుల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు చదువు పూర్తికాగానే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం F1, M1 స్టూడెంట్ వీసా హోల్డర్స్‌పై ప్రభావం చూపిస్తుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం సుమారు 3 లక్షల మంది భారతీయ విద్యార్థుల మెడపై ఈ బిల్లు కత్తిలా వేళ్లాడుతోంది. ఈ కొత్త బిల్లు అమలులోకి వస్తే చదువు పూర్తయిన తక్షణమే వారు అమెరికా విడిచి రావాల్సి ఉంటుంది. అంటే, వారికివారే సెల్ఫ్ డిపొర్ట్ అవ్వాలన్నమాట. లేదంటే వీసా గడువు ముగిసినప్పటికీ ఇంకా అమెరికాలో ఉంటున్నారనే నేరం కింద వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ ప్రభుత్వమే వారిని డిపొర్టేషన్ చేస్తుంది.
ఇప్పటికే చదువులు పూర్తి చేసుకుని, ఓపిటి ఆథరైజేషన్ తీసుకుని H1B వీసా కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిపై కూడా ఈ కొత్త బిల్లు ప్రభావం చూపనుంది. అందుకే వారంతా తమ పరిస్థితి ఏంటా అని బిక్కుబిక్కుమంటున్నారు.
ఓపిటితో లాభం ఏంటి?
అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి అక్కడే ఉద్యోగం సంపాదించుకునేందుకు ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆథరైజేషన్ అవసరం ఉంటుంది. విదేశీ విద్యార్థులలో ఓపిటి ఉన్న వారికి మాత్రమే వారు చదువుకున్న డిగ్రీ ఆధారంగా అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఈ ఓపిటి ఉన్న వారికి కనీసం మూడేళ్లపాటు అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆ సమయంలోనే వారు ఒకవైపు తాత్కాలిక అవసరాల కోసం ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే H-1B వీసా పొందేందుకు ప్రయత్నిస్తుంటారు.
అయితే, ఓపిటి విధానం రద్దు చేయడం వల్ల ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న వారికి ఆ తరువాత H-1B వీసా లేకుండా అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉండదు.
డోనల్డ్ ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఓపిటి విధానాన్ని (OPT authorization) రద్దు చేసేందుకు ప్రయత్నం జరిగినప్పటికీ అప్పట్లో అది విఫలమైంది. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే అమెరికా చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా మాస్ డిపొర్టేషన్‌కు తెరతీసిన విషయం తెలిసిందే. దీంతో ఈ బిల్లు విషయంలో కూడా ట్రంప్ వైఖరి అలానే ఉంటుందనే వార్తలొస్తున్నాయి.