Site icon PRASHNA AYUDHAM

42 శాతం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కుట్రలు అన్యాయం.

IMG 20250928 WA0098

బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే ఊరుకోమని హెచ్చరించిన నీల నాగరాజు

 

హైకోర్టులో పిటిషన్ వేసిన రెడ్డి జాగృతి నేతలపై ఆగ్రహం

 

42 శాతం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కుట్రలు అన్యాయం

 

రెడ్డి వర్గానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అడ్డుకోలేదని స్పష్టం

 

రిజర్వేషన్లపై జోక్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్యమాలు హెచ్చరిక

 

రెడ్డి సంఘ పెద్దలు జాగృతి నేతలను పిటీషన్ ఉపసంహరించుకునేలా ఒప్పించాలని విజ్ఞప్తి

 

ప్రశ్న ఆయుధం,కామారెడ్డి, సెప్టెంబర్ 28:

“బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోం” అని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు ఘాటుగా హెచ్చరించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వవద్దంటూ రెడ్డి జాగృతి నేతలు మాధవరెడ్డి, మల్లవ్వ హైకోర్టుకు పిటిషన్ వేయడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. “బీసీలు ఎవరి వాటా దోచుకోవడం లేదు. గత 22 నెలలపాటు పోరాడి సాధించుకున్న రిజర్వేషన్లను ఇప్పుడు అడ్డుకోవడం అన్యాయం” అని మండిపడ్డారు.

రెడ్డి వర్గానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు నిరాటంకంగా లభిస్తున్నప్పుడు, వాటిని బీసీలు ఎప్పుడూ అడ్డుకోలేదని గుర్తుచేశారు. “అలాంటి సమయంలో బీసీ రిజర్వేషన్లపై కుట్రలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ముమ్మరం చేస్తాం. అవసరమైతే రెడ్డి వర్గ రిజర్వేషన్లను కూడా వ్యతిరేకిస్తాం” అని హెచ్చరించారు.

హైకోర్టుకు సెలవులు ఉన్న సమయంలోనే హౌస్ మోషన్ వేయడం న్యాయపరంగానూ, నైతికంగానూ సరైంది కాదని ప్రశ్నించారు. రెడ్డి సంఘ పెద్దలు జాగృతి నేతలను ఒప్పించి పిటీషన్ ఉపసంహరించుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

“జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, చట్టసభల్లో సీట్లు కేటాయింపు సామాజిక వర్గాల హక్కు. అడ్డుకోవడాలు ఆగాలి” అని నీల నాగరాజు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. దయాకర్, నరేష్, రాజేందర్  తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version