ఎల్లారెడ్డి, అక్టోబర్ 18, (ప్రశ్న ఆయుధం):
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో బీసీ సంఘాల బంద్ పిలుపు సందర్భంగా శనివారం బంద్ ప్రశాంతంగా ముగిసింది. బీసీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీల నాయకులు విస్తృతంగా స్పందించారు. వ్యాపార సంస్థలు, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనగా, ప్రభుత్వ పాఠశాలలను బీసీ సంఘాల నాయకులు, బిఆర్ఎస్, బిజెపి, ఎమ్మార్పీఎస్ నాయకులు మూసివేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీసీ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. బంద్ విజయవంతం కావడంలో సహకరించిన వ్యాపార వర్గాలు, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి బీసీ సంఘం నాయకులు కుడుముల సత్యం, ఏగుల నర్సింలు, ప్యాలాల రాములు, బోండ్ల సాయి లు, బాలకిషన్, సిద్దు, శ్రీకాంత్, సంతోష్ తదితరులు నాయకత్వం వహించగా, బిఆర్ఎస్, బిజెపి, ఎమ్మార్పీఎస్ పార్టీ నాయకులు సమిష్టిగా పాల్గొన్నారు.
బారాస పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం నుంచే ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించబడింది. ఈ సందర్భంగా పలు వ్యాపార, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేయించారు.
ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ – “బీసీలను పథకం ప్రకారం అణగదొక్కే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవోని ప్రకటించినా, దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది” అని విమర్శించారు.
“బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే జీవోను కార్యరూపంలో పెట్టి, అఖిలపక్షంతో కలిసి ఢిల్లీకి వెళ్లి 9వ షెడ్యూల్‌లో చేర్చే విధంగా పోరాడాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
బీసీ సంఘం పిలుపుతో జరిగిన ఈ బంద్‌లో అన్ని పార్టీల నాయకులు ఒకే వేదికపై నిలబడి బీసీల హక్కుల సాధన కోసం ఐక్యంగా గళమెత్తడం విశేషం.