Site icon PRASHNA AYUDHAM

డీఏపీ కోసంరోడ్డెక్కిన రైతన్న

డీఏపీ కోసంరోడ్డెక్కిన రైతన్న

– నిరసనలో బీజేపీ అనుబంధ బీకేఎస్‌
– నష్టనివారణ చర్యలు చేపట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు
పంట విత్తుకునే సమయంలో డైఅమ్మోనియం ఫాస్ఫేట్‌ (డీఏపీ) ఎరువుకు కొరత ఏర్పడడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉదాశీన వైఖరిని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో రోడ్డెక్కారు. ఒక వైపు డీఏపీకి కొరత ఏమీ లేదని చెబుతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న మోడీ ప్రభుత్వం మరోవైపు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా మెజిస్ట్రేట్లను (డీఎంలు) రంగంలోకి దింపింది. ఆర్ఎస్ఎస్‌ అనుబంధ భారతీయ కిసాన్‌ సంఫ్ు (బీకేఎస్‌) సహా రైతు సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రభుత్వం వద్ద తగిన ప్రణాళిక లేకపోవడం, ఎరువుల సబ్సిడీలను సరిగా పెంచకపోవడం ఈ పరిస్థితికి కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.
రాష్ట్రాల్లో కొరత
న్యూఢిల్లీ: యూరియా తర్వాత రైతులు అధికంగా వినియోగించే ఎరువు డీఏపీయే. అక్టోబర్‌ 11వ తేదీన దేశంలో రబీ సీజన్‌ మొదలైంది. అన్నదాతలు పంట వేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే సకాలంలో డీఏపీ ఎరువును అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వారిలో ఆగ్రహాన్ని రేపుతోంది. హర్యానాలో పోలీస్‌ స్టేషన్లలో డీఏపీని పంపిణీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మధ్యప్రదేశ్‌లో సమస్యను పరిష్కరించే బాధ్యతను ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ మంత్రులకు అప్పగించారు. రాష్ట్రంలోని పదిహేను జిల్లాల్లో డీఏపీ ఎరువుకు కొరత ఏర్పడడంతో బీకేఎస్‌ ఆందోళన ప్రారంభించింది. సకాలంలో చైనా, రష్యా దేశల నుండి డీఏపీని కేంద్రం దిగుమతి చేసుకోలేకపోయిందని, దీంతో రాష్ట్ర అవసరాల్లో కేవలం సగం ఎరువు మాత్రమే అందుబాటులో ఉన్నదని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో పరి స్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే డీఏపీకి కొరత ఏర్పడడం యోగి ప్రభుత్వాన్ని కలవరపెట్టింది. పశ్చిమ యూపీ, బ్రజ్‌ ప్రాంతాల్లో రైతులు ఎరువుల కోసం రాత్రంతా చలికి వణుకుతూ క్యూలలో నిలబడి వేచి ఉండడం కన్పించింది. హత్రాస్‌, మధుర తదితర ప్రాంతాల్లోనూ ఇలాంటి దృశ్యాలే కన్పించాయి. ఉత్తరప్రదేశ్‌ నుండి పంజాబ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర వరకూ రైతులు ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతున్నారని రైతు సంఘాలు తెలిపాయి. సాధారణంగా సీజన్‌ ప్రారంభానికి ముందే ప్రభుత్వం డీఏపీని సేకరించి నిల్వ చేస్తుంది. కానీ ఈసారి సకాలంలో ఆ పని జరగలేదు.
నిపుణులు ఏమన్నారు?
ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేకపోవడం, ఎరువుల సబ్సిడీలు ఈ పరిస్థితికి కారణమని నిపుణులు తెలిపారు. డీఏపీ, ఇతర కాంప్లెక్స్‌ ఎరువుల కోసం కేంద్రం సెప్టెంబర్‌ 18న రూ.24,475 కోట్ల సబ్సిడీని ఆమోదించింది. అయితే డీఏపీపై సబ్సిడీని పెద్దగా పెంచలేదు. దీంతో వివిధ కంపెనీలు దానిని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. రబీ సీజన్‌లో 60 లక్షల టన్నుల డీఏపీ అవసరమవుతుందని, అక్టోబర్‌ మధ్య నుండి డిసెంబర్‌ మధ్య వరకూ దీని వినియోగం అధికంగా ఉంటుందని పేరు చెప్పడానికి ఇష్టపడని నిపుణుడొకరు చెప్పారు. అయితే ఈసారి రబీ సీజన్‌ ప్రారంభంలో పదిహేను లక్షల టన్నుల డీఏపీ మాత్రమే అందుబాటులో ఉన్నదని, ప్రభుత్వం వద్ద తగిన ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని ఆయన తెలిపారు. సబ్సిడీని చాలా తక్కువగా పెంచడంతో డీఏపీ దిగుమతులపై ప్రభావం పడిందని అన్నారు.
బీకేఎస్‌ అసంతృప్తి
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా సరఫరాల్లో అంతరాయం ఏర్పడిన మాట నిజమే అయినా యుద్ధం హఠాత్తుగా వచ్చి పడిందేమీ కాదని బీకేఎస్‌ చెప్పింది. ప్రభుత్వం ముందుగానే మేల్కొని ఓ వ్యూహాన్ని రూపొందించుకొని ఉండాల్సిందని అభిప్రాయ పడింది. డీఏపీని అధికంగా ఉపయోగించే గోధుమ, ఇతర పంటలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం డీఏపీ ఎరువుకు కొరతే లేదంటూ గణాంకాలను ఏకరువు పెడుతోంది.

Exit mobile version