డైవర్షన్‌ పొలి’ట్రిక్స్‌

డైవర్షన్‌ పొలి’ట్రిక్స్‌’
– రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల యుద్ధం
– వ్యక్తిగత విమర్శలతో ప్రజాసమస్యలు గాలికి
– ట్విటర్‌ టిల్లు, చిట్టినాయుడు అంటూ వంగ్య వాగ్భాణాలు
– సంచలన ప్రకటనలతో కాలం వృధా

రాష్ట్ర రాజకీయాల్లో హుందాతనం కొరవడుతున్నది. సద్విమర్శల స్థానే వ్యక్తిగత ఆరోపణలు చోటుచేసుకుంటున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతుంటే, ప్రజా సమస్యలు గాల్లో దీపాలవుతున్నాయి. రాష్ట్రంలో డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. జనంగోడు ఎజెండా కావాల్సిన తరుణంలో స్వార్థ రాజకీయ ప్రయోజనాలు పరకాయప్రవేశం చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఆశ్చర్యపోవడం ప్రజల వంతవుతున్నది. ఇదే అదనుగా బీజేపీ చోద్యం చూస్తున్నది. ప్రధానంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు మధ్య జరుగుతున్న విమర్శల పరంపర అందరికీ తెలిసిందే. కేటీఆర్‌ను కాంగ్రెస్‌ ట్విటర్‌ టిల్లు అంటే, సీఎం రేవంత్‌ను బీఆర్ఎస్‌ చిట్టినాయుడు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తుండటం చూస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సాధ్యమైనంతలో హామీలను అమలుచేస్తున్నామని కాంగ్రెస్‌ అంటుండగా, మీరిచ్చిన వాగ్దానాలు మూసీలో కొట్టుకుపోయాయని బీఆర్ఎస్‌ చెబుతున్నది. కాంగ్రెస్‌ నుంచి సీఎంతోపాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి, సీతక్క, కోమటిరెడ్డి తదితరులు తెలంగాణ భవన్‌పై ఒంటికాలిపై లేస్తున్నారు. అలాగే గాంధీభవన్‌పై కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు గళం వినిపిస్తున్నారు. టిట్‌ ఫర్‌ టాట్‌లా ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ అసలు విషయాలపై ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు జుగుప్సాకరంగా తయారయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విధానాల ప్రాతిపదికన కాకుండా వ్యక్తిగత అంశాల ఆధారంగా రాజకీయాలు నడుస్తుండటంతో ప్రజాసమస్యల ఎజెండా పక్కకుపోతున్నదని వామపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. రాజకీయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం కొరవడుతుండటం, హుందాతనం లోపిస్తుండటంతో ఇటు పాలకపక్షం, అటు ప్రతిపక్షం యువతకు, భవిష్యత్‌ తరాలకు ఎలాంటి విలువలు, ఆదర్శాలు వారసత్వంగా లభిస్తాయనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. విధానాలపై సద్విమర్శలు చేసే బదులు ఇలా వ్యక్తిగత దూషణలకు దిగడం సామాన్యులు, పేదలకు ఎలాంటి ప్రయోజనాలూ చేకూర్చదు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన ప్రజాస్వామ్యయుతంగా లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. రుణమాపీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర ఒకట్రెండు హామీలు మినహా మెజార్టీ హామీలు విస్మరించారని ప్రతిపక్షాలు అంటున్నాయి. తొలుత హైడ్రా పేరుతో సర్కారుకు జనంలో క్రేజ్‌ పెరిగింది. కష్టపడి నాలుగు పైసలు వెనకేసుకుని కొన్న పేదల ఇండ్లను కూలగొట్టేందుకు హైడ్రా ముందుకు రావడంతో కొంత అసంతృప్తి నెలకొంది. అధికారంలో ఉన్న వాళ్లు బాధ్యతతో వ్యవహరించాలి. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు సర్కారుకు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు అందించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ రెండూ ప్రశ్నార్థకమవుతున్నాయి. ఇదిలావుంటే సందట్లో సడేమియాలా బీజేపీ లబ్ది పొందాలని చూస్తున్నది. అధికార, ప్రతిపక్షాలను తప్పుబట్టడమే తప్పితే, మోడీ సర్కారు నుంచి నాలుగు రూపాయలు ఎక్కువ తెచ్చి రాష్ట్రాభివృద్ధికి సహకరించే ఆలోచన లేదు. ఎంతసేపూ మోడీ, అమిత్‌షాలకు బాకా ఊదే కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఆర్థికస్థితిని మెరుగుచేసే ప్రయత్నమే చేయడం లేదు. సాధారణ నిధుల దగ్గర నుంచి జీఎస్టీ కాసుల వరకు హక్కుగా రావాల్సిన వాటిని మోడీ సర్కారు అడ్డుకుంటున్నది. కొర్రీలు పెడుతూ తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నది. ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. వీరు సైతం సంచలన రాజకీయ ప్రకటనలకే పరిమితమవుతున్నారు. రాష్ట్రానికి మంజూరై పనులు ఆలస్యమవుతున్న జాతీయ రహదారులపై ఇద్దరు కేంద్రమంత్రులకు దృష్టి లేదు. భారీ వర్షాలతో నష్టపోయిన రాష్ట్రానికి సాయం చేసే విషయమై పట్టింపు అంతకన్నా లేదు. మూసీ నిద్ర అంటూ కాలం గడపడం తప్ప పటిష్ట కార్యాచరణ అసలే లేదు. రాష్ట్రం అప్పులకుప్పగా మారుతున్న తరుణంలో ఆదుకోవాల్సిన కేంద్రం చోద్యం చూస్తుండగా, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులిద్దరూ, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే చందాన వ్యవహరిస్తుండటం గమనార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment