లేబర్ కోడ్‌లు అమలు చేయొద్దు
– అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపండి
– ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి..
– ఆంక్షలు ఎత్తేయండి
– జీవోలను సవరించి కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించండి
– కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలి
– వీఆర్ఏల వారసులకు వారసత్వ ఉద్యోగాలివ్వాలి
– ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో కార్మిక వర్గం సమస్యలను పరిష్కరించాలి : సీఎం రేవంత్‌రెడ్డికి సీఐటీయూ వినతి
కార్మికుల హక్కులను హననం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను తెలంగాణలో అమలు చేయవద్దని సీఎం రేవంత్‌రెడ్డిని సీఐటీయూ రాష్ట్ర కమిటీ కోరింది. లేబర్‌కోడ్‌లను అమలు చేయబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఉద్యోగులు, సంఘటిత, అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విన్నవించింది. ఈ మేరకు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి వినతిపత్రాన్ని అందజేశారు. 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ సవరించేందుకు జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో పెరుగుతున్న నిత్యావసర ధరలను పరిగణనలోకి తీసుకోని విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే రాష్ట్రంలోని 1.20 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందనే విషయాన్ని సీఎంకు వివరించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ తదితర నాన్ పర్మినెంట్ ఉద్యోగులు, కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులివ్వాలని విన్నవించారు. పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచడంతో పాటు ఆరేడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించాలనీ, ఎన్నికల హామీ మేరకు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని విన్నవించారు. రెండో పీఆర్సీలో మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ఎన్ని మ్యానిఫెస్టోలో పొందుపర్చినట్టుగా అంగర్‌వాడీ టీచర్లు, హెల్పర్ల్‌కు రూ.18, వేల వేతనాన్ని ఇవ్వాలని విన్నవించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ కొత్త జీఓ జారీ చేయాలన్నారు. ఆశా వర్కర్లకు పారితోషికాలు కాకుండా ఫిక్సిడ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన నిర్వహణకు అవసరమైన గ్యాస్‌ను ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలని, ఎన్నికల హామీ ప్రకారం మిడ్‌డే మీల్స్ కార్మికులకు రూ.10 వేల గౌరవ వేతనం చెల్లించాలని విన్నవించారు. ఐకేపీ విఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలనీ, ఎన్నికల హామీ మేరకు వేతనాన్ని రూ.20 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
మీసేవా, కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. ఏఎన్ఎం, ఎన్‌హెచ్ఎం, ఆస్పత్రుల్లో పనిచేసే కార్మికులు, 104, 108, ఆరోగ్యశ్రీ, టిసాక్స్, ఆయుష్, వైద్య విధాన పరిషత్ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది సిబ్బంది సర్వీసులు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో జీఓ నెం.142ను రద్దు చేయాలని, వైద్య విధాన పరిషత్ అటానమస్ హౌదాను రద్దు చేసి ఉద్యోగులకు చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలన్నారు. జీఓ నెం.317 ద్వారా వస్తున్న ఉద్యోగుల విజ్ఞప్తులను పరిష్కరించాలనీ, ఆరోగ్యమిత్రలకు క్యాడర్ మార్పు చేసి వేతనాలు పెంచాలని కోరారు. ఎన్‌హెచ్ఎంలో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ డైలీవేజ్, ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ తదితర సిబ్బందికి రెగ్యులర్ ఉద్యోగులకు ఇస్తున్న మూల వేతనాన్ని కనీస వేతనంగా చెల్లించాలని కోరారు.ఆర్టీసీని కార్మికోద్యమంపై ఆంక్షలు ఎత్తివేసి ప్రజాతంత్ర హక్కులు కల్పించాలనీ, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని విన్నవించారు. సింగరేణి కార్మికులకు సొంతిటి కల నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కోలిండియాలో మాదిరిగా ఆదాయ పన్నును సింగరేణి కార్మికులకు తిరిగి చెల్లించాలనీ, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. కోలిండియా సిఫారసు చేసిన హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలనీ, విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులందరికీ అర్హతను బట్టి జెఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్స్, సబ్ ఇంజనీర్స్, ఓఎస్‌లుగా కన్వర్షన్ ఇవ్వాలని, అన్‌మెన్డ్ కార్మికులను ఆర్టిజన్స్‌గా గుర్తించాలని కోరారు. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ మొత్తం ఉద్యోగులకు అమలు చేయాలని, విద్యుత్ సంస్థలో ఉన్న 20 వేల మంది ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ చేయాలని కోరారు. ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పిఆర్‌సి, డిఎ, హెచ్ఆర్ఏ మరియు వయోపరిమితి పెంపును అమలు చేయాలనీ, అందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని విన్నవించారు. భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన మోటార్ సైకిల్స్, స్కూటీలు వెంటనే ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికుల సలహా మండలి కమిటీని కార్మిక సంఘాల నాయకులతో నియమించాలని కోరారు. బీడీ కార్మికులకు 26 రోజుల పనికల్పించి కనీన వేతనం ఇవ్వాలన్నారు. పీిఎఫ్‌తో ముడి పెట్టకుండా బీడీ పరిశ్రమలో పనిచేసే అన్ని కేటగిరీ కార్మికులకు జీవనభృతి రూ.4,016 చెల్లించాలని కోరారు. హమాలీలకు, రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్‌బోర్డులు ఏర్పాటు చేయాలనీ, వారికి రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని విన్నవించారు. మహాలక్ష్మితో ఉపాధి దెబ్బతిన్న నేపథ్యంలో ప్రతినెలా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.4,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అవసరమయ్యే వస్త్రాలను, మహిళా సంఘాలకు ఇచ్చే చీరలను తయారు చేసే బాధ్యతను చేనేత కార్మికులకు అప్పగించాలని కోరారు. వర్కర్ టూ ఓనర్ పథకాన్ని అమలు చేయాలని విన్నవించారు. పవర్‌లూమ్ కార్మికుడికి ప్రభుత్వ గ్యారంటీతో రూ.5 లక్షల పెట్టుబడి సాయం అందివ్వాలని విన్నవించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల నుండే అందులో పనిచేసే కార్మికులకు వేతనాలు, ఈపిఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని, రూ.5 లక్షల బీమా పాలసీ చేయించాలని కోరారు. జీఓ నెం.81 ప్రకారం మిగిలిన 3,797 మంది విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ శాఖల ద్వారా రిపోర్టులు తెప్పించి తగు చర్యలు తీసుకొని పరిష్కరిస్తానని సీఎం హామీనిచ్చారని తెలిపారు.