ఇద్దరు గంజాయి నిందితులను అరెస్టు చేసిన గజ్వేల్ పోలీసులు
ఇద్దరు నిందితుల వద్ద నుండి పది కిలోల గంజాయి స్వాధీనం
ఒక సెల్ ఫోన్ రికవరీ
గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి
సిద్దిపేట టాస్క్ ఫోర్సు పోలీస్ అధికారులతో పాటు గజ్వేల్ పోలీసులు నిఘాపెట్టి నూతన టెక్నాలజీ సహాయంతో చాకచక్యంగా గంజాయి అమ్ముతున్న నిందితులను పట్టుకున్నట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. బుధవారం ఏసీపీ విలేకరులతో మాట్లాడుతూ ఇద్దరు గంజాయి నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిందితుల నుండి ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని వారిని గజ్వేల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు చెప్పారు. ఈ సందర్బంగా ఏసీపీ నిందితుల వివరాలను వెల్లడించారు. అరికెల శేఖర్ తండ్రి రామచంద్రం, వయస్సు 23 సంవత్సరాలు, వృత్తి డ్రైవింగ్ అమ్మదీపూర్ గ్రామం, గజ్వేల్ మండలం, సిద్దిపేట జిల్లాకు చెందినవాడని, సుక్కసారి భాను ప్రసాద్ తండ్రి వెంకటేష్ వయస్సు 21 సంవత్సరాలు, వృత్తి హెచ్పీ గ్యాస్ డెలివరీ బాయ్, నివాసం మల్లబోయినపల్లి గ్రామం, జడ్చర్ల మండలం మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుత నివాసం సిరిసినగండ్ల సిద్దిపేట జిల్లా నివాసిగా ఉన్నాడని తెలిపారు.
* పరారీలో ఉన్న నిందితులు..!
బోయిని నరేష్ తండ్రి రాములు, వయస్సు 23 సంవత్సరాలు, వృత్తి ఆటో డ్రైవర్, అమ్మదీపూర్ గ్రామం, గజ్వేల్ మండలం, సిద్దిపేట జిల్లా, వర్ధన్, నివాసం సీలేరు భద్రాచలంకు చెందిన నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, గజ్వేల్ పోలీసులు నిఘా పెట్టి టెక్నాలజీతో చాకచక్యంగా గంజాయి అమ్ముతున్న నిందితులను పట్టుకున్నారని తెలిపారు. కేసు వివరాలు తెలియపరుస్తూ అరికెల శేఖర్ తండ్రి రామచంద్రం, అదే గ్రామానికి చెందిన బోయిని నరేష్, సుక్కసారి భాను ప్రసాద్ ముగ్గురు కలిసి చెడు అలవాట్లకు బానిసయి గంజాయి అమ్మి డబ్బులు సంపాదిద్దామని నిర్ణయించుకొని సిద్దిపేట పరిసర ప్రాంతాలలో బైకులు దొంగతనం చేసి అదే మోటార్ సైకిల్ పై సీలేరుకు వెళ్ళి గతంలో 2, 3 సార్లు గంజాయి తీసుకొచ్చి గజ్వేల్, అహ్మదీపూర్ చుట్టుపక్కల గ్రామాల కూలీలకు యువకులకు రెట్టింపు ధరకు అమ్మినట్లు చెప్పారు. గత ఎనిమిది నెలల క్రితం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మడానికి వెళ్లుచుండగా త్రీటౌన్ పోలీసులు పట్టుకొని గంజాయి మోటార్ సైకిల్ రికవరీ చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు చెప్పారు. వారు బెయిల్ పై జైలు నుండి బయటకు వచ్చినట్లు తెలిపారు. గత వారం రోజుల క్రితం శేఖర్, నరేష్, గంజాయి తీసుకుని రావడానికి సీలేరు వెళుచున్నామని వారి స్నేహితుడు భాను ప్రకాష్ కు ఫోన్ చేయగా నాకు పని ఉంది నేను రాను నాకు గంజాయి కావాలని 7000 రూపాయలు శేఖర్ కు ఫోన్ పే చేశాదని, నరేష్ స్నేహితుడు చింటు బైకు తీసుకొని అరికెల శేఖర్, బోయిని నరేష్ ఇద్దరు భద్రాచలం సీలేరుకు వెళ్లి వర్ధన్ అనే వ్యక్తికి రూ. 30,800 వేల రూపాయలు ఇచ్చి 20 కిలోల గంజాయి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. మోటార్ సైకిల్ పై వస్తే ఎవరైనా పోలీసులు పట్టుకుంటారని అరికెల శేఖర్ ఒక బ్యాగులో పది కిలోల గంజాయి పెట్టుకొని హైదరాబాద్ వరకు బస్సులో వచ్చినట్లు, అక్కడి నుండి ఊరికి వచ్చి ఎవరైనా చూస్తారని అనుమానంతో ఊరు బయట గ్రామ శివారు మల్లన్న సాగర్ కట్ట వద్ద దాచి పెట్టినట్లు, గంజాయి కావాలని భాను ప్రసాద్ రాగానే అందులో నుండి అతనికి 2 కిలోల గంజాయి ఇచ్చాడని చెప్పారు. అరికెల శేఖర్, సుక్కసారి భాను ప్రసాద్ నిందితుల వద్ద నుండి పది కిలోల గంజాయి, ఒక సెల్ ఫోన్, రికవరీ చేసి ఇద్దరు నిందితులను గజ్వేల్ అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యం రాజు అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగిందని చెప్పారు. కేసు పరిశోధన కొనసాగుతుందని, త్వరలో నరేష్, వర్ధన్ ఇద్దరు నిందితులను పట్టుకొని అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాలలో పట్టణాలలో ఎవరైనా గంజాయి ఇతర పత్తు పదార్థాలు కలిగి ఉన్న, అమ్ముతున్నారని సమాచారం ఉన్న వెంటనే డయల్ 100 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని, లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ మొబైల్ నెంబర్ 8712667100 నెంబర్ కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, పెద్ద మొత్తంలో గంజాయి పట్టించే వారికి నగదు పురస్కారం అందజేస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లా గురించి కృషి చేస్తున్న పోలీసులకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని సూచించారు. చాకచక్యంగా గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, ఇన్స్పెక్టర్లు జానకి రామ్ రెడ్డి, రమేష్, సిబ్బంది, గజ్వేల్ ఇన్స్పెక్టర్లు సైదా, ముత్యం రాజు, సిబ్బందిని పోలీస్ కమీషనర్ డాక్టర్ అనురాధ అభినందించారు. త్వరలో రివార్డ్ అందజేయడం జరుగుతుందని తెలిపారు.