బీహార్‌లో ప్రశాంత్ కిశోర్ నిరాహారదీక్ష..
ఆయన లగ్జరీ వ్యాన్‌పై సర్వత్రా విమర్శలు.. ఎందుకంటే?
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) డిసెంబర్ 13న నిర్వహించిన కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత పదిరోజులుగా నిరుద్యోగులు ఆందోళన కొనసాగుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరికీ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు సుపరిచితమే. గత కొన్నేళ్ల క్రితం బిహార్ లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు. సొంతంగా జన్ సురాజ్ పార్టీని కూడా స్థాపించారు. పాదయాత్రసైతం చేశారు. గతేడాది నవంబర్ లో బీహార్ రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తొలిసారి జన్ సురాజ్ పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేయగా అన్ని నియోజకవర్గాల్లో ఓడిపోయారు. ఈ ఏడాది బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు జన్ సురాజ్ పార్టీ సన్నద్ధమవుతుంది. ఈ క్రమంలో అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాదరణ పొందాలని ప్రశాంత్ కిషోర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు మద్దతుగా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) డిసెంబర్ 13న నిర్వహించిన కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత పదిరోజులుగా నిరుద్యోగులు ఆందోళన కొనసాగుతున్నారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఆదివారం వేలాది మంది అభ్యర్థులు పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద నిరసనకు దిగారు. జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ విద్యార్థులకు పూర్తి మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి నివాసం వైపు ర్యాలీగా బయల్దేరేందుకు విద్యార్థులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా.. పట్నాలోని గాంధీమైదాన్ లో మహాత్ముడి విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే, ఈ సమయంలో అక్కడ ఓ లగ్జరీ వ్యాన్ ఉంది. ఆ వ్యాన్ ప్రశాంత్ కిషోర్ ది కావడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రశాంత్ కిషోర్ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న వేదిక పక్కనే లగ్జరీ వాహనం ఉంది. అందులో ఏసీ, కిచెన్, బెడ్రూం వంటి సకల సదుపాయాలు ఉన్నాయి. అందులో వాష్ రూమ్ కూడా ఉంది. ఈ వాహనం ఖరీదు కోట్ల రూపాయలు ఉంటుంది. దీంతో ప్రశాంత్ కిశోర్ పై రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్నారు. లగ్జరీ వాహనం పక్కన పెట్టుకొని పీకే దీక్ష చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విద్యార్థి ఉద్యమంలో పాల్గొంటున్న ప్రశాంత్ కిశోర్.. విద్యార్థులకు మేలుచేయడం అటుంచితే రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నాడని బీజేపీ నేత నీరజ్ కుమార్ విమర్శించారు. బీపీఎస్సీ విద్యార్థులు ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. మరోవైపు నెట్టిట్లోనూ ప్రశాంత్ కిశోర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రశాంత్ కిశోర్ పై వస్తున్న విమర్శలను జన్ సురాజ్ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. ఆ వ్యాన్ అక్కడ ఉండటం అసలు సమస్య కానేకాదు. ఇక్కడ పట్టించుకోవాల్సిన అంశం విద్యార్థుల భవిష్యత్తు. ప్రశాంత్ కిశోర్ ను, విద్యార్థులకోసం ఆయన చేస్తున్న ఉద్యమాన్ని కించపర్చేందుకు మధ్యలో వ్యాన్ ను అధికారపార్టీ నేతలు అస్త్రంగా చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తాజా పరిణామాలపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు నా నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు.