58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు.. విజేతలకు బహుమతుల ప్రదానం

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీలకు విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం, ముగింపు కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి సి.వసుంధర నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ వెల్ఫేర్ అధికారి జగదీష్, మాజీ ఎంఈఓ అంజయ్య, భారతీయ విద్యా మందీర్ ప్రిన్సిపాల్ లింగాగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. గ్రంథాలయాలు సమాజ అభివృద్ధికి మూల స్తంభాలని పేర్కొన్నారు. పుస్తకాలు చదవడం ద్వారా విద్యార్థులు మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి విజ్ఞానాన్ని విస్తరించుకోవచ్చని వారు అన్నారు. నేటి డిజిటల్ యుగంలో కూడా పుస్తకాల ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదని, అవి మనలో ఆలోచన శక్తిని పెంపొందిస్తాయని, విద్య, సంస్కృతి, మనోభావాల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. అనంతరం గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు జి.అంజయ్య మాట్లాడుతూ.. గ్రంథాలయాల వినియోగాన్ని పెంచే దిశగా మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పుస్తకాల పట్ల యువతలో ఆసక్తి మరింత పెరిగి, గ్రంథాలయాల సందర్శన పెరగాలని ఆకాంక్షించారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా చిత్రలేఖనం, పోస్టర్ తయారీ, గ్రంథాలయ స్లోగన్స్ వంటి పలు పోటీలు నిర్వహించగా, జిల్లాలోని వివిధ విద్యాసంస్థల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్న విజేతలకు ప్రధాన అతిథుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తిస్తూ పలు సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now