వరద నీటిలో కరిగిపోయిన రూ.60 కోట్ల పంచదార..
ఆసియాలోనే అతిపెద్ద షుగర్ మిల్లులో భారీ నష్టం
హరియానాలో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం
యమునానగర్‌లోని సరస్వతి షుగర్ మిల్లులోకి చేరిన వరద నీరు
దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హర్యానాలో కుండపోత వర్షాలకు ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పేరుగాంచిన సరస్వతి షుగర్ మిల్లులో భారీ నష్టం వాటిల్లింది. వరద నీరు గిడ్డంగిలోకి చేరడంతో సుమారు రూ.60 కోట్ల విలువైన పంచదార నీటిపాలైంది.
యమునానగర్‌లోని ఈ మిల్లులో రాత్రికి రాత్రే ఈ ఘటన చోటుచేసుకుంది. మిల్లు పక్కనే ఉన్న కాల్వ పొంగిపొర్లడంతో వరద నీరు ఒక్కసారిగా ప్రాంగణంలోకి చేరిందని సరస్వతి షుగర్ మిల్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా తెలిపారు. గిడ్డంగిలో నిల్వ ఉంచిన 2.20 లక్షల క్వింటాళ్ల పంచదారలో అత్యధిక భాగం తడిసిపోయిందని ఆయన వెల్లడించారు.
“రాత్రి కురిసిన భారీ వర్షానికి మిల్లులోకి నీరు చేరింది. సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయల నష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. మిల్లు చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి” అని ఆయన వివరించారు. అయితే ఈ నష్టం వల్ల స్థానిక మార్కెట్లపై పంచదార సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన స్పష్టం చేశారు.