టన్నెల్‌లో టెన్షన్ .. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు..!!

టన్నెల్‌లో టెన్షన్ .. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు..!!

నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద కూలిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పైకప్పు

బోర్ డ్రిల్లర్ మిషిన్‌తో పనులు చేస్తుండగా 14వ కిలోమీటర్‌ పాయింట్ వద్ద ప్రమాదం

ఆ టైమ్‌లో విధుల్లో 50 మంది.. వారిలో 42 మంది సురక్షితంగా బయటకు

ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్ర్భాంతి.. మంత్రులు ఉత్తమ్, జూపల్లి పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ టీమ్స్

కిలోమీటర్ మేర నీళ్లు, రాళ్లు, బురద చేరడంతో సహాయ చర్యలకు ఆటంకం.. టైమ్ గడుస్తున్న కొద్దీ లోపల ఉన్న కార్మికుల క్షేమంపై ఆందోళన

నేడు సింగరేణి రెస్క్యూ టీమ్స్, ఆర్మీ కూడా టన్నెల్ వద్దకు చేరుకునే చాన్స్ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్.. ఘటనపై ఆరా

నాగర్‌కర్నూల్‌ / అమ్రాబాద్ : శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్ (ఎస్ఎల్‌బీసీ) టన్నెల్-1లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 9గంటలకు టన్నెల్ఎంట్రెన్స్ నుంచి 14వ కిలో మీటర్ పాయింట్(నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట) వద్ద సొరంగంలో బోర్ డ్రిల్లింగ్ మిషిన్‌తో పనులు చేస్తుండగా, ఒక్కసారిగా మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఆ టైమ్‌లో ఇంజినీర్లు, ఆపరేటర్లు, కార్మికులు కలిపి 50 మంది టన్నెల్‌ లోపల విధుల్లో ఉన్నారు. ప్రమాదం జరిగిన అనంతరం 42 మంది సురక్షితంగా బయటకు రాగా.. కూలిన ప్రాంతంలో టన్నెల్బోర్ మిషిన్వద్ద ఉన్న 8 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. ఆ ప్రాంతమంతా మట్టి, రాళ్లు, నీళ్లు, బురదతో నిండిపోయింది.

కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించింది. తెలంగాణ, ఏపీకి చెందిన ఫైర్‌, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్బృందాలు ఘటనా స్థలానికి వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కిలోమీటర్దాకా మట్టి, బురద పేరుకుపోవడంతో లోపల చిక్కుకున్న వాళ్ల పరిస్థితిపై ఆందోళన నెలకొన్నది. కాగా, ఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.

ఉదయం 8 గంటలకు విధుల్లోకి..

ఐదేండ్ల కింద నిలిచిపోయిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులు నాలుగు రోజుల కిందే ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం 8గంటలకు ప్రాజెక్ట్‌, ఫీల్డ్‌ ఇంజినీర్లు, జనరేటర్‌ ఆపరేటర్లు, కార్మికులు 50 మంది టన్నెల్ లోపలికి వెళ్లి 14వ కిలోమీటర్‌ వద్ద పనులు ప్రారంభించారు. టన్నెల్బోర్‌ డ్రిల్లింగ్మిషన్‌ స్టార్ట్‌ చేసిన కొద్దిసేపటికే మట్టి రాలడం, నీళ్లు(సీపేజ్) వస్తుండడాన్ని గమనించిన టన్నెల్‌ బోరింగ్‌ ఆపరేటర్ మిగతా సిబ్బందిని అలర్ట్‌ చేశాడు. బోర్డ్రిల్లింగ్మిషన్‌కు రెండుపక్కలా ఉన్నవాళ్లు అలర్ట్అయ్యేలోగా పైన గతంలో వేసిన కాంక్రీట్స్లాబ్‌ సహా మూడు మీటర్ల మేర పైకప్పు కుప్పకూలింది. ఆ ప్రాంతమంతా రాళ్లు, మట్టి, బుదరతో నిండిపోయింది.

బోర్మిషన్‌కు ఇవతలి వైపు ఉన్న 42 మంది బయటకు వచ్చినా మిషన్దగ్గర్లో ఉన్న ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. బయటకు వచ్చిన వారిలో పలువురు స్వల్పంగా గాయపడగా, వారికి ఫస్ట్‌ ఎయిడ్‌ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే టన్నెల్‌లో కరెంట్‌ సరఫరా నిలిచిపోవడంతో అంతా అయోమయం నెలకొంది. జెన్‌కో ఆఫీసర్లు అలర్ట్‌ అయి హుటాహుటిన కరెంట్సరఫరాను పునరుద్ధరించారు. టన్నెల్‌లో పనులు జరుగుతున్న టైమ్‌లో అక్కడ ఉన్న వారికి ఆక్సిజన్‌ అందించేందుకు ప్రత్యేకంగా పైపులైన్‌ను ఏర్పాటు చేశారు. టన్నెల్‌లో పనులు ప్రారంభమైన నాటి నుంచే ఈ లైన్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో టన్నెల్‌లో ప్రస్తుతం ఆక్సిజన్‌కు ఇబ్బంది లేనప్పటికీ.. కాంక్రీట్స్లాబ్, మట్టి, రాళ్లు, బరద మీదపడ్డ వారి పరిస్థితి ఎలా ఉందో అంతుచిక్కడం లేదు.

మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్..

టన్నెల్‌ వద్ద ప్రమాదం విషయం తెలియగానే సీఎం రేవంత్‌రెడ్డి హుటాహుటిన రంగంలోకి దిగారు. వెంటనే సహాయకచర్యలు చేపట్టాలని మంత్రులతో పాటు ఆ శాఖ ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఐజీ సత్యనారాయణ, నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్, ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ దోమలపెంటకు చేరుకున్నారు. అప్పటికే చేరుకున్న జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి అక్కడి అధికారుల ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈలోగా తెలంగాణ, ఏపీకి చెందిన ఫైర్‌, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ టన్నెల్‌ వద్దకు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. గతంలో ఉత్తరాఖండ్‌లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అనుభవం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్‌ ఆర్మీకి సైతం కబురుపెట్టింది. వీరితోపాటు సింగరేణి రెస్క్యూ టీమ్స్ సైతం ఆదివారం తెల్లవారుజాము వరకు స్పాట్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ టీమ్స్సంఘటన జరిగిన చోటుకు వెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. కానీ వీరి ప్రయత్నాలకు టన్నెల్‌లో పేరుకపోయిన బురద, మట్టి ఆటంకంగా మారింది.

నిమిషం ఆలస్యమైనా చనిపోయేవాళ్లం : అల్లావుద్దీన్..

నిమిషం ఆలస్యమైనా చనిపోయేవాళ్లమని టన్నెల్ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన అల్లావుద్దీన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు. లోపలికి వెళ్లగానే ప్రమాదం జరిగిందని, టైమ్‌కు లోకో రావడంతో తనతో పాటు మిగిలిన వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పాడు.

టన్నెల్‌లోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..

టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లైఫ్ సపోర్ట్ఎక్విప్‌మెంట్స్‌తో లోకోలో లోపలికి వెళ్లాయి. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, నాగర్‌కర్నూల్, నల్గొండ జిల్లాల ఎస్పీలు దగ్గరుండి పర్యవేక్షించారు. టన్నెల్ పైకప్పు కూలిన చోట 200 మీటర్ల ఎత్తు వరకు మట్టి, బురద, సిపేజ్ నీరు చేరుకుందని తెలిసింది. టన్నెల్ లోపల డ్రిల్లర్ మిషన్ తవ్వే మట్టిని బయటకు తోడిపోసే కన్వేయర్ బెల్టు తెగినట్టు సమాచారం.

మొదట ఆర్మీ రెస్క్యూ టీమ్ రాక కోసం ఎదురుచూసిన అధికారులు.. ఆలస్యమవుతున్నదని భావించి ఎన్డీఆర్ఎఫ్‌ను రంగంలోకి దించారు. టన్నెల్‌లోకి ఆక్సిజన్ సరఫరా చేసే పైప్కూడా బ్రేక్అయి ఉంటుందన్న అనుమానంతో రెస్క్యూ టీమ్ బృందం ఆక్సిజన్ సిలిండర్లు, నైట్ విజన్ గాగుల్స్, ఇతర అత్యవసర పరికరాలు సమకూర్చుకుంది. లోపల వెంటిలేషన్, ఆక్సిజన్సమస్య ఉండే అవకాశం ఉంది.

టన్నెల్లో చిక్కుకున్నది వీళ్లే..

1. మనోజ్‌కుమార్‌ (ప్రాజెక్ట్ ఇంజినీర్)

2. శ్రీనివాస్‌ (ఫీల్డ్ ఇంజినీర్‌)

3. సన్నీ సింగ్ (జనరేటర్‌ ఆపరేటర్)

4. గురుప్రీత్‌సింగ్‌ (టెక్నీషియన్)

5. సందీప్‌ సాహూ (లేబర్)

6. జగ్తా ఎక్స్ (లేబర్)

7. సంతోష్‌ సాహూ (లేబర్)

8. అంజూ సాహూ (లేబర్)

Join WhatsApp

Join Now

Leave a Comment