Site icon PRASHNA AYUDHAM

కుప్పంలోని డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రపంచానికే నమూనా

IMG 20250703 WA0639

చిత్తూరు జిల్లా, కుప్పం జూలై 3: రోగుల వైద్య రికార్డులను అస్పత్రులు, ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ కుప్పంలో ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ ను కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఆవిష్కరించారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా రోగుల వైద్య రికార్డులను ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని 13 ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలను డిజినెర్వ్ సెంటర్ తో అనుసంధానించారు. అనంతరం పీహెచ్సీలకు చెందిన హెల్త్ ఆఫీసర్లతో వర్చువల్ గా చంద్రబాబు సంభాషించారు. వైద్య సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు సూచనలు జారీ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ ”రెండో దశలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అనుసంధానిస్తాం. ఆ తదుపరి దశలో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తాం. ఆయుష్మాన్ భారత్ తో పాటు ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని కూడా సమన్వయం చేస్తాం. వ్యక్తుల హెల్త్ హిస్టరీని డిజిటలైజ్ చేయడంతోపాటు.. మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు చేస్తున్నాం. కుప్పంలో అమలు చేస్తున్న డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రపంచానికే నమూనాగా మారుతుంది. డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా వైద్య రంగంలో అత్యుత్తమ సాంకేతికతను కూడా సమన్వయం చేస్తాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఆధునిక పరిజ్ఞానాన్ని కూడా దీనికి అనుసంధానిస్తాం. డిజినెర్వ్ సెంటర్ తో ఏఎన్ఎంలు, అంగన్వాడీలతోనూ అనుసంధానం చేయాలి.“ అని సీఎం అన్నారు.

టెక్నాలజీతో వైద్య ఖర్చులు తగ్గించండి

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వైద్య ఖర్చులు తగ్గించేలా చూడాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. బడ్జెట్లో వైద్యారోగ్యానికి రూ.19 వేల కోట్ల వ్యయం అవుతోందని టెక్నాలజీ వినియోగం ద్వారా దీన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని అన్నారు. “డేటా లేక్ ద్వారా, డేటా కలెక్షన్ ద్వారా వ్యక్తులకు అందించాల్సిన చికిత్సకు అవసరమైన ఔషధాలను కూడా అందించొచ్చు. ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మోనిటరింగ్ లాంటి అంశాలను పరిశీలించాలి. కాస్ట్ ఎఫెక్టివ్ వేరబుల్స్ ద్వారా గర్భిణుల ఆరోగ్యాన్ని కూడా నిరంతరం తనిఖీ చేసేలా కార్యాచరణ చేపట్టండి. మొబైల్ మెడికల్ యూనిట్స్ ద్వారా ప్రతీ మూడు నెలలకూ రక్త పరీక్షలు నిర్వహించాలి.” అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

దశలవారీగా రాష్ట్రంలో డిజినెర్వ్ సెంటర్ సేవలు

కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటైన రాష్ట్రంలోని తొలి డిజినెర్వ్ సెంటర్ ద్వారా రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆస్పత్రులు, ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలు అనుసంధానం అయ్యాయి. టాటా, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పంలోని 13 ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాల నుంచి డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు ప్రజలు వినియోగించుకోనున్నారు. డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఏరియా ఆస్పత్రి- 13 పీహెచ్సీలు, 92 విలేజ్ హెల్త్ సెంటర్లను అనుసంధానించారు. వ్యక్తిగత వైద్య రికార్డుల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉండేలా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు అందించనుంది. సకాలంలో రోగ నిర్ధారణ, వైద్య నిపుణుల అప్పాయింట్మెంట్, వ్యక్తిగత కౌన్సిలింగ్ తదితర సేవల్ని డిజిటల్ నెర్వ్ సెంటర్ అందించనుంది. వర్చువల్ విధానంలోనూ రోగికి వైద్య నిపుణుల్ని అందుబాటులోకి తీసుకువచ్చి చికిత్స అందించే వెసులుబాటు కలుగనుంది. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం సేవలు, ప్రైవేటు ఆస్పత్రులతో అనుసంధానం కూడా నెర్వ్ సెంటర్ ద్వారా చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. రోగనిర్ధారణ, ఆరోగ్య సేవలు, స్క్రీనింగ్ టెస్టులు, తదుపరి అంశాలు కూడా ఫాలో అప్ ఉండేలా డిజి నెర్వ్ సెంటర్ ద్వారా రోగులకు సేవలు అందుతాయి. ప్రజారోగ్యానికి సంబంధించి అన్ని వివరాలను ఒక్క చోట చేర్చేలా డిజి నెర్వ్ సెంటర్ తొలివిడతగా కుప్పంలోనూ, రెండో దశలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడో దశలో రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలను అందుబాటులోకి ప్రణాళిక రూపొందించారు.

Exit mobile version