రెంజల్ మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
*అభివృద్ధి పనులు, భూభారతి దరఖాస్తులపై అధికారులతో సమీక్ష*
*పీ.హెచ్.సీ, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఎరువుల గోడౌన్ తనిఖీ*
ప్రశ్న ఆయుధం నిజామాబాద్, ఆగస్టు 04 : రెంజల్ మండలంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వీరన్నగుట్ట లోని జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి సెంటర్ లను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది హాజరును పేస్ రికగ్నేషన్ విధానం (ఎఫ్.ఆర్.ఎస్) ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. యూడైస్ లో అందరు విద్యార్థుల నమోదు పూర్తయ్యిందా అని ఆరా తీశారు. కిచెన్, టాయిలెట్స్, తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్, పాఠశాల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న గదులను తొలగింపజేయాలని ఆదేశించారు. కిచెన్, పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని హెచ్.ఎం లను ఆదేశించారు. బాలుర కోసం టాయిలెట్స్, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలను, అంగన్వాడీ సెంటర్, ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. పీ.హెచ్.సీలో మెడికల్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో వారి గురించి అడిగి తెలుసుకున్నారు. అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేసి, సిబ్బంది హాజరును పరిశీలించారు. విధులలో లేని వారికి అటెండెన్స్ రిజిస్టర్ లో కలెక్టర్ స్వయంగా ఆబ్సెంట్ వేసి, డీఎంహెచ్ఓ కు గైర్హాజరు అయిన డాక్టర్లు, సిబ్బంది వివరాలు పంపించారు. రెంజల్ అంగన్వాడీ కేంద్రంలో కూడా టీచర్ లేకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్, తగు చర్యలు తీసుకోవాలని సీడీపీఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేసి ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎరువుల వివరాలతో కూడిన స్టాక్ బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించాలని అన్నారు.
అక్కడి నుండి ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీరాజ్ ఏ.ఈ లతో సమీక్షించారు. ఎన్ని పనులు మంజూరయ్యాయి, వాటిలో ఎన్ని ప్రారంభం అయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, అన్ని పనులు గ్రౌండింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి అయ్యేలా చొరవ చూపాలన్నారు. మండల, గ్రామ ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా అభివృద్ధి పనులను పరిశీలిస్తూ, వాటి ప్రగతిపై క్రమం తప్పకుండా సమీక్ష జరపాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్.డబ్ల్యు.ఎస్, ఆర్ అండ్ బీ తదితర ఇంజనీరింగ్ విభాగాల ఏ.ఈ ల క్షేత్రస్థాయి సందర్శనలకు సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలో మూవ్ మెంట్ రిజిస్టర్ నిర్వహించాలని, జిల్లాలోని అన్ని మండలాల్లో దీనిని విధిగా అమలుపర్చాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పారిశుద్ధ్య పనులు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఎంపీఓ ను ఆదేశించారు. ప్రతీ రోజు క్రమం తప్పకుండా శానిటేషన్ సిబ్బంది ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు సోకకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి నివాస ప్రాంతంలో ఫాగింగ్, స్ప్రే జరిపించాలని సూచించారు.
అనంతరం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తో కలిసి తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.
కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.