రొయ్యకు ట్రంప్‌ దెబ్బ…!!

రొయ్యకు ట్రంప్‌ దెబ్బ

సుంకాల బాదుడుతో విలవిల.. ఎగుమతుల్లో దేశంలోనే ఏపీ టాప్‌

ఏటా రూ.20 వేల కోట్ల ఎగుమతి

అందులో అమెరికాకే 16 వేల కోట్లు

గోదావరి జిల్లాల వాటానే 60 శాతం

సుంకాల ప్రకటనతో పడిపోయిన ధర

టన్నుకు రూ.40 వేలకు పైగా నష్టం

ధరలు మరింత తగ్గే అవకాశం

*అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆక్వా ఎగుమతులపై తొలుత విధించిన 25 శాతం సుంకం ఈ నెల 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.* *దీంతో లక్షకు 25 వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి రవాణా, ఇతర ఖర్చులు అదనం. తాజాగా సుంకాన్ని 50 శాతానికి పెంచడంతో లక్షకు రూ.50 వేలు చెల్లించాలి.*

*ఈ నెల 27వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానుంది. ట్రంప్‌ ప్రకటన వెలువడగానే రొయ్యల ధరలు పడిపోయాయి. టన్నుకు రూ.40 వేల దాకా నష్టపోతున్నామని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు అండగా నిలవకపోతే ఆక్వా రంగం కుదేలయ్యే ప్రమాదముంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ ఎగుమతులపై భారీగా సుంకాలు విధించడం ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఆక్వా రంగంపై భారీ దెబ్బ పడనుంది. ఆక్వా ఎగుమతులపై ట్రంప్‌ 50 శాతం సుంకం విధించడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఆక్వా రైతులు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులు తాజాగా సుంకాల దెబ్బకు తమపై పెనుభారం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో రొయ్యల ధరలు మరింత పతనమైతే ఆక్వా సాగు చేయాలా, వద్దా అనే మీమాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.

మరోవైపు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) యాంటీబయోటిక్‌ ఆరోగ్య ప్రమాణాలను కఠినతరం చేసింది. దీనివల్ల మందులు ఎక్కువ వాడిన రొయ్యలను తిరస్కరించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు, ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆక్వా ఎగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించగానే రాష్ట్ర ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. సుంకాల పెంపు వల్ల ధరలు, ఎగుమతులపై ప్రభావం, ఆక్వా రంగ పరిస్థితిపై అధ్యయనం చేస్తోంది.

*గోదావరి’ ఆయువు పట్టు*

ఆక్వా రంగానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఆయువు పట్టు. దేశవ్యాప్తంగా విదేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యల్లో ఈ రెండు జిల్లాల నుంచే దాదాపు 60 శాతం ఉత్పత్తి జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఏటా దాదాపు 10-11 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుండగా, అందులో ఉభయ గోదావరి జిల్లాల్లోనే 6లక్షల టన్నుల వరకు ఉత్పత్తి చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతోంది. అందులో అమెరికాకు 40 శాతం, చైనాకు 30 శాతం ఎగుమతి అవుతున్నాయి. వీటి ద్వారా భారీగా విదేశీ మారకద్రవ్యం వస్తోంది. భీమవరం కేంద్రంగా ప్రఖ్యాతి పొందిన రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్‌లు ఉన్నాయి. తాజాగా ట్రంప్‌ విధించిన 50 శాతం సుంకం ఈ నెల 27నుంచి అమల్లోకి రానుంది. ఇక్కడి నుంచి అమెరికాకు రొయ్యలు ఎగుమతి చేయాలంటే 40 రోజుల వ్యవధి పడుతుంది. దీంతో వ్యాపారులు ఇప్పటి నుంచే ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.

*పడిపోయిన రొయ్యల ధరలు*

ఆక్వా ఉత్పత్తులలో అమెరికాకు 40 శాతం ఎగుమతి అవుతున్నది. 20 కౌంటు నుంచి 60 కౌంటు మాత్రమే ఎక్కువ శాతం ఎగుమతి చేస్తున్నారు. తొలుత ఆక్వా ఎగుమతులపై 25 శాతం సుంకం విధించినపుడు అమెరికాలోని బయ్యర్లు ఈ భారాన్ని భరించేందుకు అంగీకరించారని చెబుతున్నారు. 50 శాతం సుంకం పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటన చేశాక అమెరికాలోని బయ్యర్లు చేతులెత్తేశారనే ప్రచారం తెరపైకి తెచ్చి, రొయ్యల ధరలను స్థానిక ఎగుమతిదారులు తగ్గించివేశారని ఆక్వా రైతులు అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉత్పత్తయ్యే పెద్దరొయ్యలలో 50 శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా అఽధ్యక్షుడు సుంకం పెంచుతున్నట్లు ప్రకటన చేసిన వెంటనే స్థానికంగా ఉన్న ఎగుమతిదారులు గత మూడు, నాలుగు రోజులుగా రొయ్యల ధరలను తగ్గించి వేశారు. గతంలో కిలోకు 25 తూగే రొయ్యల ధర రూ.565 ఉండగా, ఇప్పుడు రూ.430కు తగ్గించారు.

*కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వాలి*

గతంలో అసైన్డ్‌ భూములలో సాగు చేసే రొయ్యల చెరువులకు కూడా విద్యుత్‌ సబ్సిడీ ఇచ్చేవారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం రాయితీని ఎత్తివేసింది. దీంతో రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పట్టాదార్‌ పాస్‌పుస్తాకాలు ఉన్న భూములనే ఆక్వా జోన్‌ పరిధిలోకి తెచ్చి అసైన్ఢ్‌ భూములను మినహాయించింది. ఆక్వా జోన్‌లో ఉన్నప్పటికీ ఒక్కో రైతుకు 10 ఎకరాల వరకే విద్యుత్‌ రాయితీని ఇస్తామని గత ప్రభుత్వం మెలికపెట్టింది. ఇటీవల కూటమి ప్రభుత్వం ఆక్వా రంగాన్ని పరిశ్రమగా గుర్తించింది. మేత ధరలు తగ్గించింది. రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ సరఫరా చేస్తోంది. ఆక్వా జోన్‌ను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. కేంద్రం కూడా రాయితీలు కల్పిస్తే అమెరికా విధించిన టారిఫ్‌ నుంచి గట్టెక్కే అవకాశం ఉందని అటు వ్యాపారులు, ఇటు రైతులు ఆశిస్తున్నారు.

*ఏటా 20వేల కోట్ల ఎగుమతులు*

అమెరికాకు రొయ్యల ఎగుమతిలో ఏపీ ప్రధాన వాటాదారు. దాదాపు రూ.20 వేల కోట్ల రొయ్యలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుండగా.. ఇందులో అమెరికాకు వెళ్లే రొయ్యల విలువే రూ.16 వేల కోట్లు ఉంది. అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్‌గా నిలిచే యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) దేశాలకు ఆక్వా ఉత్పత్తులు పంపడం సవాల్‌తో కూడుకున్నదని ఆక్వా ఎగుమతిదారులు అంటున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగంపై దాదాపు 10 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. సుంకాల పెంపుతో ఎగుమతులు, ఉత్పత్తులు నిలిచిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్రప్రభుత్వం, కేంద్రం చర్యలు తీసుకోవాలని ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అధ్యక్షుడు పి.భాస్కర్‌ కోరారు. ప్రధానంగా ప్రత్యామ్నాయ మార్కెట్ల అన్వేషణలో సహకరించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment