ప్రజావాణి ద్వారా వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలి – జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 25
ప్రజల నుండి వచ్చిన అర్జీలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడమేనని ఆమె స్పష్టం చేశారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి జె.ఎల్.బి. హరిప్రియతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు (హౌసింగ్), మున్సిపాలిటీ, పెన్షన్లు, రెవెన్యూ, వైద్య, వ్యవసాయ శాఖలకు సంబంధించిన మొత్తం 95 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రాధిక గుప్తా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పర్యటించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ ప్రజా భవన్లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ద్వారా వచ్చిన దరఖాస్తుల పురోగతిని కూడా ఆమె సమీక్షించారు.
పెండింగ్లో ఉన్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగంగా పరిష్కరించాలని, పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆమె ఆదేశించారు. తిరస్కరించిన దరఖాస్తులపై తప్పకుండా రిమార్కులు నమోదు చేయాలని సూచించారు.
ప్రజావాణిపై ప్రజలకు నమ్మకం కల్పించడం అధికారుల బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.