బీరప్ప గుడి స్థలం కబ్జాపై రామకృష్ణ నగర్ కాలనీవాసుల ఆందోళన
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఆగస్టు 25
నాగారం మున్సిపాలిటీ 14వ వార్డు, రామకృష్ణ నగర్ కాలనీలోని బీరప్ప గుడి స్థలం కబ్జా కావడాన్ని నిరసిస్తూ కాలనీవాసులు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం నాగారం మున్సిపాలిటీ కార్యాలయం ముందు భారీ ధర్నా చేపట్టారు.
ఆందోళనకారులు మాట్లాడుతూ, సర్వే నంబర్లు 64, 66, 74, 75, 76, 77లో కలిపి 529 గజాల విస్తీర్ణంలో ఉన్న గుడి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారని ఆరోపించారు. గతంలో గ్రామ పంచాయతీ హద్దుల్లో ఉన్నప్పుడు, అలాగే మున్సిపాలిటీగా మారిన తర్వాత కూడా ఈ స్థలంలో జరిగిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారని గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు మున్సిపల్ అధికారులు కబ్జాదారులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం గుడి స్థలం మాత్రమే కాకుండా, రోడ్లు, పార్కు స్థలాలు కూడా ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రెండు నెలల క్రితం బీరప్ప గుడి స్థలంపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కు స్థలాలపై కబ్జాల విషయమై మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారని, ‘తాము ఏ చర్యలు తీసుకోలేము’ అని సమాధానమిచ్చారని ఆరోపించారు.
దీంతో ఆందోళనకారులు ‘కమిషనర్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. వెంటనే కమిషనర్ వచ్చి గుడి స్థలంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ ధర్నాలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, బీజేపీ యువజన నాయకుడు కౌకుట్ల రాహుల్ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ రామకృష్ణ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, యాదగిరి, సంతోష్ గౌడ్, నాగరాజు సహా కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.