మట్టి గణపతులతో పర్యావరణ పరిరక్షణ: జిల్లా కలెక్టర్ పిలుపు!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 26
వినాయక చవితి పండుగ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ మను చౌదరి పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జల వనరులు కాలుష్యానికి గురవుతున్నాయని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలను ఉపయోగించి ప్రకృతిని కాపాడాలని ఆయన సూచించారు.మంగళవారం రోజున కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని మరింత పెంచింది. ఈ సందర్భంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ , ప్రాంతీయ కార్యాలయం మేడ్చల్-మల్కాజిగిరి ఆధ్వర్యంలో రూపొందించిన మట్టి గణపతి విగ్రహాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే గోడపత్రికలను కలెక్టర్ విడుదల చేశారు. అనంతరం, కలెక్టరేట్ సిబ్బందికి మరియు ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం ద్వారా కూకట్‌పల్లి, బాలానగర్, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో ప్రజలకు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా రెవెన్యూ అధికారి జేఎల్బి హరిప్రియ, కలెక్టరేట్ పరిపాలన అధికారి రామ్మోహన్, సహాయక పర్యావరణ శాస్త్రవేత్త జి. లింగయ్య, ప్రాజెక్ట్ అనలిస్ట్ డి. రాకేష్ తదితరులు పాల్గొన్నారు. పండుగ సంబరాలతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించాలన్న కలెక్టర్ సందేశం ప్రజల్లో మంచి స్పందనను పొందింది.