క్రీడల ప్రాధాన్యత.. ఆరోగ్యమే మహాభాగ్యం : ఈటల
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఎంఎల్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో క్రీడా మైదానాల ప్రారంభం
ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి పాల్గొనడం
ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో క్రీడల అభివృద్ధి – కేంద్రం ప్రాధాన్యం
యువతకు క్రీడలు, టెక్నాలజీ సమన్వయం అవసరం అని ఈటల పిలుపు
“ఆరోగ్యం లేకపోతే సంపద వృథా.. శ్రమే శక్తి” – విద్యార్థులకు పాఠం
హైదరాబాద్ :
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంఎల్ఆర్ చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి కలిసి శనివారం “మర్రి లక్ష్మారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల”లో ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ ట్రాక్, బాస్కెట్‌బాల్, వాలీబాల్ మైదానాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడుతూ —
“హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ పుట్టినరోజును ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం లేకపోతే వృథా. క్రీడలు శరీరానికి శక్తినిచ్చి మానసిక బలాన్ని పెంపొందిస్తాయి” అని అన్నారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, యువతే దేశ భవిష్యత్తని ఆయన పేర్కొన్నారు. “మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, చంద్రయాన్ విజయం.. ఇవన్నీ భారత మేధస్సు ప్రతిభను చూపిస్తున్నాయి. విద్యార్థులు ఆ మేధస్సు ఆరోగ్యవంతమైన శరీరంలోనే వికసిస్తుంది” అని ఈటల వ్యాఖ్యానించారు.
టెక్నాలజీని మంచికి వినియోగించుకోవాలని, సెల్‌ఫోన్ రెండువైపుల కత్తి లాంటిదని విద్యార్థులకు సూచించారు. “కలాం కలలు కని చూపిన మార్గమే స్ఫూర్తి కావాలి. టెక్నాలజీ పేదల అభివృద్ధికి ఉపయోగపడాలి. డ్రగ్స్ అలవాటు కాకుండా క్రీడల్లో పాల్గొనండి” అని పిలుపునిచ్చారు.
చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి 81 ఏళ్ల వయసులోనూ ఈత, వాకింగ్ చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ఈటల ప్రశంసించారు. “అన్నం తినడం ఎంత సహజమో.. నడక కూడా అలవాటు చేయాలి. మీ ఎదుగుదలతోనే దేశం ఎదుగుతుంది” అని సందేశమిచ్చారు.