వరద బాధిత కుటుంబాలకు అండగా రామకృష్ణ మట్, ఇన్ఫోసిస్ ముందడుగు
ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 8, కామారెడ్డి పట్టణంలోని ఇఎస్ఆర్ గార్డెన్స్‌లో సోమవారం వరద బాధిత కుటుంబాలకు రిలీఫ్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రామకృష్ణ మట్, ఇన్ఫోసిస్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చేతుల మీదుగా 334 రిలీఫ్ కిట్లు అందజేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో తీవ్ర నష్టం సంభవించిందని గుర్తుచేశారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రామకృష్ణ మట్ ఇప్పటికే వైద్య శిబిరాలు నిర్వహించిందని, ఇప్పుడు ఇన్ఫోసిస్‌తో కలిసి నిత్యావసర సరుకులు అందించిందని తెలిపారు.
ప్రతి రిలీఫ్ కిట్‌లో బియ్యం, పప్పులు, నూనె, ఉప్పు, పసుపు, సబ్బులు, బ్లాంకెట్లు, దుప్పట్లు తదితర సరుకులు ఉన్నాయి. రేపు ఎల్లారెడ్డిలో 150, బాన్సువాడలో మరో 150 కిట్లను పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు.
ఈ సహాయం మొత్తం విలువ సుమారు 20 లక్షల రూపాయలని పేర్కొంటూ, ఆపదలో ముందుకు వచ్చిన రామకృష్ణ మట్, ఇన్ఫోసిస్ సంస్థలకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్ధన్, రామకృష్ణ మట్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.