15 సెప్టెంబర్ ఒక గొప్ప రోజు.. నాకు తృప్తి లభించింది.. జగన్ ఆసక్తికర ట్వీట్..
ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ, కమ్యూనిస్టులు భగ్గుమంటున్నారు..
అయితే, పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేట్‌పరం కాదు.. ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది కదా? అని కూటమి నేతలు ప్రశ్నించారు.. ఈ తరుణంలో ఆసక్తికర ట్వీట్ చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..
ఇక, ఎక్స్‌లో వైఎస్ జగన్ చేసిన ట్వీట్ విషయానికి వస్తే… ‘ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబర్, 2023 ఒక గొప్ప రోజు.. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలనా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు.. నేను ఒక మంచి పని చేయగలిగానన్న తృప్తి నాకు లభించింది.. 1923 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హయాంలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను సంకల్పించాం.. ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 15న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించి ప్రజల ఆరోగ్య పరిరక్షణలో గొప్ప అడుగు ముందుకేశాం.. ఈ ఐదు కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవడం నాకు సంతోషాన్ని కలిగించింది. వీటితో పాటు పాడేరు, పులివెందుల కాలేజీలను అడ్మిషన్లకు కూడా సిద్ధం చేశాం. మిగిలిన పనులను పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఆ 10 కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం. ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.’ అంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్..