రంగాచారి విగ్రహానికి సిపిఐ ఘన నివాళులు

రంగాచారి విగ్రహానికి సిపిఐ ఘన నివాళులు

— సాయుధ పోరాట వార్షికోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పశ్య పద్మ డిమాండ్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 16

 

కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు పనిహారం రంగాచారి విగ్రహానికి సోమవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో రంగాచారి గారి త్యాగాలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా పశ్య పద్మ మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4 వేల మంది ప్రాణాలు అర్పించారని, లక్షల ఎకరాల భూములను నిరుపేదలకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పంపిణీ చేశారని తెలిపారు. కౌలు రైతులు సాగు చేస్తున్న భూములపై హక్కుదారులుగా గుర్తింపు పొందడం, 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచడం, 3 వేల గ్రామాలను విముక్తి చేయడం వంటి చారిత్రక విజయాలు కమ్యూనిస్టుల పోరాట ఫలితమని వివరించారు.

వెట్టిచాకిరి రద్దు, భూ సంస్కరణ చట్టాలు, నిజం రాజును ఓడించడం కమ్యూనిస్టుల పోరాట ఫలితమని ఆమె పేర్కొన్నారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో బీజేపీ ఎలాంటి పాత్ర వహించలేదని, పైగా ఆ పోరాటాన్ని హిందూ–ముస్లిం గొడవగా వక్రీకరించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు.

తెలంగాణ సాయుధ పోరాట వారసులు, ప్రత్యేకంగా కామారెడ్డి ప్రాంతానికి చెందిన రంగాచారి వంటి యోధులను గుర్తించి, సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సీనియర్ నాయకులు విఎల్ నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు కంజర భూమన్న, జిల్లా కార్యదర్శి ఎల్. దశరథ్, జిల్లా సహాయ కార్యదర్శి పి. బాలరాజు, కార్యవర్గ సభ్యులు రాజమణి, దేవయ్య, ఈశ్వర్, బాల్రాజ్, సాయిగౌడ్, హనుమాన్లు, సాయిలు, రాజిరెడ్డి, లక్ష్మణ్, ప్రవీణ్, రాజశేఖర్, సంపత్, రాములు, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment