కామారెడ్డి రేషన్ డీలర్ల డిమాండ్లు – కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేయాలని విజ్ఞప్తి
కామారెడ్డి టౌన్, సెప్టెంబర్ 20:
కామారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తరఫున అధ్యక్షులు నాగం సురేందర్, ప్రధాన కార్యదర్శి వై. సంతోష్‌రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉన్న మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ ఆలీ ,కు వినతిపత్రం సమర్పించారు.
2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రేషన్ డీలర్లకు నెలకు రూ.5,000 గౌరవ వేతనం, ప్రతి క్వింటాలకు రూ.300 కమీషన్ ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదని పేర్కొని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం పంపిణీని విజయవంతంగా పూర్తి చేయడంలో రేషన్ డీలర్ల పాత్ర కీలకమని సంఘం నాయకులు తెలిపారు. జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడం ద్వారా దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని, ఇందులో రేషన్ డీలర్ల కృషి ఎంతో ఉందని వివరించారు.
రేషన్ డీలర్ల ప్రధాన డిమాండ్లు:
1. నెలకు రూ.5,000 గౌరవ వేతనం
2. ప్రతి క్వింటాలకు రూ.300 కమిషన్
3. దిగుమతి హమాలీ ఖర్చు ప్రభుత్వమే భరించాలి
“ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా మేము పని చేస్తున్నాం. చాలీచాలని కమిషన్లతో బతుకుదెరువు సాగిస్తున్నాం. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సవినయంగా కోరుతున్నాం” అని సంఘం అధ్యక్షుడు నాగం సురేందర్ పేర్కొన్నారు.