అలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తే కఠిన చర్యలు… యూట్యూబర్లకు సజ్జనార్ వార్నింగ్
సోషల్ మీడియా ఛానళ్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చిన్నారులను బలిపెట్టవద్దని వ్యాఖ్య
పిల్లలతో అనుచిత కంటెంట్ చేయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక
లైక్స్, వ్యూస్ మాయలో పడి విలువలను మర్చిపోతే ఎలా?
యూట్యూబ్ ఛానళ్లపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. లైక్స్, వ్యూస్ మాయలో పడి విలువలను మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. వ్యూస్, లైక్స్‌తో సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అయ్యేందుకు చిన్నారుల భవితను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్లతో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న ఇంటర్వ్యూలను ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వీసీ సజ్జనార్ పోస్ట్ పెట్టారు.
చిన్నారులతో అసభ్యకరమైన కంటెంట్‌ను చేస్తూ, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? చిన్నారులు, యువతకి స్ఫూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి సమాజాభివృద్ధికి దోహదపడండి. అంతేకానీ ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించే పనులు చేయొద్దు. గుర్తు పెట్టుకోండి. ఇది బాలల హక్కుల ఉల్లంఘనే కాదు, చట్టరీత్యా నేరం కూడా.”….ఎక్స్‌లో సీపీ సజ్జనార్
చిన్నారులతో అసభ్యకరమైన కంటెంట్‌ను చేయడం లాంటి చర్యలు పోక్సో, జువైనల్ జస్టిస్ చట్టాలను ఉల్లంఘించడమేనని సీపీ సజ్జనార్ ఎక్స్‌లో పేర్కొన్నారు. పిల్లలను ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం, వారిని వేధించడం కిందికే వస్తుందని తెలిపారు.
అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం..! మైనర్లతో ఈ తరహా కంటెంట్‌ను చేసే వారి పట్ల పోలీస్ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుందని సీపీ సజ్జనార్ ‘ఎక్స్’లో తెలిపారు. అలాంటి వాటికి సంబంధించిన బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. తక్షణమే వీటిని తొలగించకున్నా, భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసినా చట్టప్రకారం కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇలాంటి వీడియోలపై వెంటనే రిపోర్ట్ చేయండి..!
సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే రిపోర్టు చేయాలని యూజర్లను కోరారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. హెల్ప్‌లైన్ నంబర్ 1930కి గానీ, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ (cybercrime.gov.in)లో ఫిర్యాదు చేయొచ్చన్నారు. తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం మాత్రమే కాదు, వారి బాల్యం, మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును కాపాడటం కూడా మీ బాధ్యతే అనే విషయం మరిచిపోవద్దని సజ్జనార్ పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం క్రమంగా పెరిగింది. ఈ క్రమంలోనే కొంతమంది ఎక్కువ వ్యూస్, లైక్స్ రావడం కోసం మైనర్లతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు. అలాంటి వాటివల్ల మైనర్లపై చెడు ప్రభావం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సీపీ సజ్జనార్ యూట్యూబ్ ఛానళ్లను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అనుచిత వీడియోలు చేసే వారిపై కఠిన చర్యలకు కూడా వెనకాడమని ఆయన హెచ్చరించారు.
ఇటీవలే స్పష్టంగా చెప్పిన సీపీ సజ్జనార్..!
హైదరాబాద్ నూతన కమిషనర్‌గా వీసీ సజ్జనార్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు అరికట్టడంతో పాటు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే తాజాగా యూట్యూబ్ ఛానళ్లకు సజ్జనార్ వార్నింగ్ ఇవ్వడం విశేషం. మరోవైపు బెట్టింగ్ భూతంపై కూడా సజ్జనార్ పోరాడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ వల్ల వచ్చే అనర్థాలపై ఇప్పటికే ఆయన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.