మెగా రక్తదాన శిబిరం
సమాజ సేవలో పాల్గొన్న నేటి యువత
ప్రశ్న ఆయుధం
కామారెడ్డిజిల్లా అక్టోబర్ 18
కామారెడ్డి జిల్లాలో సామాజిక సేవా స్పూర్తి ప్రతిధ్వనించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మత్స్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో రక్తదాన శిబిరం జరిగింది.
జిల్లా రెవెన్యూ అధికారి మదన్ మోహన్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రాణాలను రక్షించడంలో రక్తదానం కన్నా గొప్ప దానం మరొకటి లేదు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా రక్తదానంలో పాల్గొంటే అత్యవసర పరిస్థితుల్లో ఎన్నో ప్రాణాలను కాపాడగలము” అని పేర్కొన్నారు. రక్తదానం మానవతా కర్తవ్యమేకాక, సమాజంలో సానుభూతి, ఐక్యతకు చిహ్నమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి పి. శ్రీపతి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ యం. రాజన్న, వైస్ ఛైర్మన్ ఏ. నాగరాజు గౌడ్, జిల్లా కరస్పాండెంట్ డా. పి.వి. నర్సింహా, మత్స్య శాఖ సిబ్బంది, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఈ రక్తదాన శిబిరంలో 40 మంది ఉత్సాహంగా రక్తదానం చేయగా, భిక్నూర్ మండలం యెల్లారెడ్డి గ్రామానికి చెందిన మత్స్యకారులు కూడా పాల్గొనడం విశేషం. జిల్లావ్యాప్తంగా ప్రజలు మంచి స్పందన చూపడంతో రక్త యూనిట్ల సేకరణ గణనీయంగా నమోదైంది.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో పాల్గొన్న వారందరికీ జిల్లా మత్స్య అధికారి పి. శ్రీపతి మరియు రెడ్ క్రాస్ సొసైటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.