బీసీ రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు  అనిల్‌కుమార్ యాదవ్

బీసీ రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు

అనిల్‌కుమార్ యాదవ్

ప్రశ్న ఆయుధం, అక్టోబర్ 18 శేరిలింగంపల్లి ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్‌కి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటించింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌ ఆదేశాల మేరకు, స్థానిక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ జగదీశ్వర్‌ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ, “బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. బీసీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్” అని అన్నారు.

తెలంగాణలో విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉన్నదని తెలిపారు. అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ, భారస పార్టీలు మద్దతు ఇచ్చినట్టే తర్వాత కోర్టులో నాటకం ఆడి బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నాయని తీవ్ర విమర్శలు చేశారు.

“రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా ఏం ఉపయోగం? సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసి బీసీ బిల్లు 9వ షెడ్యూల్‌లో చేర్చేలా ప్రయత్నిస్తే బీజేపీ, భారస పార్టీలు మద్దతు ఇవ్వకుండా మొహం చాటేశాయి” అని అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. బీజేపీ, భారస పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని, బీసీలకు మోసం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. బీసీల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, అప్పుడు మాత్రమే బీసీలకు నిజమైన న్యాయం సాధ్యమని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now