కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల బరిలో బీజేపీ ప్యానల్ నిలిచేనా..?

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల బరిలో బీజేపీ ప్యానల్ నిలిచేనా..?

పోటీకి దింపాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఒత్తిడి తెస్తున్న బీజేపీ శ్రేణులు

బాస సత్యనారాయణ ఛాంబర్ లో బీజేపీ జిల్లా నేతల సమావేశం

రేపో ఎల్లుండో తుది నిర్ణయం తీసుకోనున్న బండి సంజయ్

కరీంనగర్ అక్టోబర్ 19 ప్రశ్న ఆయుధం

కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. రేపటి నుండి నామినేషన్ల పర్వం మొదలు కానుంది. నవంబర్ 1న ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ తరపున ప్యానెల్ ను నిలబెట్టేందుకు ఆ పార్టీ సిద్ధం కావడంతో భారతీయ జనతా పార్టీ సైతం ప్యానల్ ను బరిలోకి దింపాలని ఆ పార్టీ శ్రేణుల నుండి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై ఆయ శ్రేణులు ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి అధ్యక్షతన జిల్లా ముఖ్య నేతలు ఈరోజు పార్టీ మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ నివాసంలో సమావేశమై అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో ప్యానెల్ ను బరిలో దింపే అంశంపై సుధీర్ఘంగా చర్చించారు. గంగాడి క్రిష్ణారెడ్డి, బాస సత్యనారాయణతోపాటు మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్, వాసాల రమేశ్, కోమాల ఆంజనేయులు, ఓదెలు, బోయినిపల్లి ప్రవీణ్ రావు. కన్నె క్రిష్ణ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల్లో బీజేపీ పక్షాన ఇండిపెండెంట్ ప్యానెల్ ను బరిలో దించేతేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని మెజారిటీ నేతలు వ్యక్తం చేశారు. ఈ విషయంలో బండి సంజయ్ పట్ల అర్బన్ బ్యాంక్ ఓటర్లకు సానుకూలత ఉందని, ఎన్నికల్లో ప్యానెల్ గెలుపుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

వాస్తవానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయాల్లోకి వచ్చాక తొలిసారి ప్రజాప్రతినిధిగా చేపట్టిన పదవి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ మాత్రమే. అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా ఉన్న సమయంలోనే కరీంనగర్ కో-ఆపరేటివ్ బ్యాంకు సహా పలు బ్యాంకులను నష్టాల సాకుతో మూసివేసేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపట్టింది. ఆ సమయంలో బ్యాంకు ఛైర్మన్ గా ఉన్న డి.శంకర్ తో కలిసి డైరెక్టర్ బండి సంజయ్ అర్బన్ బ్యాంకును కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. రుణాల రికవరీలో ముందంజలో నిలిపారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా బ్యాంకు సేవలు కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు. అర్హులైన వారందరికీ రుణాలు వచ్చేలా చేశారు. సంజయ్ డైరెక్టర్ గా ఉన్న సమయంలోనే అత్యధికంగా అర్బన్ బ్యాంకు సభ్యత్వం ఇప్పించారు.

ప్రస్తుతం కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో 9,600 మంది ఓటర్లున్నారు. వీరిలో అత్యధిక మంది ఓటర్ల బండి సంజయ్ పట్ల అభిమానం ఉన్నవారేనని అర్బన్ బ్యాంకు ఓటర్లు చెబుతున్నారు. అర్బన్ బ్యాంకు లో అవినీతి, అక్రమాలు తగ్గాలంటే బీజేపీ పక్షాన ప్యానెల్ ను బరిలోకి దింపాలని కోరుతున్నారు. ఈ మేరకు బండి సంజయ్ కు, బీజేపీ నాయకులకు ఫోన్లు చేసి ఒత్తిళ్లు తెస్తున్నారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని జిల్లా బీజేపీ నాయకులు ఆదివారం రోజున సమావేశమై పోటీ చేసే అంశంపై చర్చించారు. బీజేపీ శ్రేణులు, అర్బన్ బ్యాంకు ఓటర్ల మనోభావాలను సైతం కేంద్ర మంత్రి బండి సంజయ్ ద్రుష్టికి తీసుకెళ్లారు. బీజేపీ పక్షాన ప్యానెల్ ను బరిలో దింపాలనే భావనను వారు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రేపు లేదా ఎల్లుండి ఈ విషయంపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి.

Join WhatsApp

Join Now