జాతీయ విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా రూ.25 వేల ఆర్థిక సహాయం
గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులను ఘనంగా సత్కరించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 20
కామారెడ్డి జిల్లా క్రీడా రంగంలో మరోసారి గర్వకారణంగా నిలిచింది. జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించి జిల్లాకు విశేష గుర్తింపు తెచ్చిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం తన ఛాంబర్‌లో ఘనంగా సత్కరించారు. జిల్లా పరిపాలన తరఫున ఒక్కో క్రీడాకారుడికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.
గోతి పరశురం, కిన్నెరా ఆనంద్, మలవాత్ ఈశ్వర్ అనే ముగ్గురు అథ్లెటిక్స్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ గోల్డ్ మెడల్స్ సాధించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కష్టపడి సాధించిన ఈ విజయాలు జిల్లాలోని యువతకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడల్లో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, నిరంతర సాధన, ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడంలో జిల్లా పాలన ఎల్లప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు.
జిల్లాలో క్రీడా రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, క్రీడా మైదానాల అభివృద్ధి, శిక్షణా సదుపాయాలు, కోచింగ్, క్రీడా సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో మరింత మందికి ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలు అందించే ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాశాఖ అధికారి రంగ వేంకటేశ్వర గౌడ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, సెక్రటరీ అనిల్‌తో పాటు క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.