సాధారణ కుటుంబం నుంచి సేవా శిఖరాలకు
గాంధారి యువకుడు మమ్మాయి సంజీవ్ యాదవ్ సేవలకు విశేష గుర్తింపు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 21
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం,సేవే మూలధనం… మానవత్వమే మార్గం అన్న నినాదాన్ని జీవితంగా మలుచుకుని ముందుకు సాగుతున్న గాంధారి యువకుడు మమ్మాయి సంజీవ్ యాదవ్ సేవలకు విశేష గుర్తింపు లభిస్తోంది. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, చదువుతో పాటు తండ్రికి తోడుగా పొలం పనులు చేస్తూ జీవన విలువలను అలవర్చుకున్న సంజీవ్ యాదవ్ నేడు సేవా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు.
విద్యాభ్యాసం పూర్తయ్యాక హాస్పిటల్‌లో ఉద్యోగంలో చేరిన ఆయన, అక్కడ సంపాదించిన అనుభవాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు సేవాభావాన్ని ముందుకు తీసుకెళ్లిన సంజీవ్ యాదవ్, మెల్లిమెల్లిగా వ్యాపార రంగంలో అడుగులు వేసినా మానవీయతను మాత్రం ఎక్కడా వదలలేదు.
కొన్ని సంవత్సరాలుగా అదే ఆసుపత్రిలో నిరంతర సేవలందిస్తూ, పేషెంట్ల అవసరాలను ముందుగానే గుర్తించి స్పందించడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. ముఖ్యంగా గాంధారి మండలం నుంచి హైదరాబాద్‌కు చికిత్స నిమిత్తం వచ్చే ప్రతి పేషెంట్‌ను తన కుటుంబ సభ్యుల్లా భావించి, ఆసుపత్రి ప్రక్రియలు, వైద్య సలహాలు, అవసరమైన సహకారం అందిస్తూ అండగా నిలిచారు. ఈ సేవలతో సహచరుల మన్ననలతో పాటు పేషెంట్ల హృదయాల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
“సాయం చేయడమే నా సంపద” అన్న తత్వాన్ని ఆచరణలో పెట్టి, డబ్బుతో కొనలేని మానవత్వాన్ని తన సేవల ద్వారా చాటుతున్న వ్యక్తిగా సంజీవ్ యాదవ్ గుర్తింపు పొందుతున్నారు. ఒకప్పుడు పెద్దలు చేసిన సేవల కథలు వినేవాళ్లమని, అవే కథలు నేడు కళ్లముందే కనిపిస్తున్నాయంటూ గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు.
వ్యక్తిగత లాభాలకంటే సమాజ హితం కోసం తన ప్రయాణాన్ని మలుచుకుంటూ ముందుకు సాగుతున్న సంజీవ్ యాదవ్‌లో భవిష్యత్ నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గాంధారి మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆయన గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్‌గా పనిచేస్తూ చేసిన సేవలే ఈసారి ఆయన శ్రీమతి మమ్మాయి రేణుక యాదవ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
సోమవారం నిర్వహించనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆశీర్వదించాలని గ్రామ నాయకులు పిలుపునిస్తున్నారు. సేవతో పేరు సంపాదిస్తూ, నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్న యువ నాయకుడు మమ్మాయి సంజీవ్ యాదవ్ గాంధారి రాజకీయ, సామాజిక జీవితంలో ప్రత్యేక అధ్యాయంగా నిలుస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.